మొండిబాకీలపై 23లోగా ఆర్‌బీఐ కొత్త సర్క్యులర్‌

29 Apr, 2019 06:06 IST|Sakshi

ఎన్నికల ఫలితాల్లోగా విడుదల!

దివాలా ప్రక్రియకు మరింత గడువుకు ఆస్కారం

న్యూఢిల్లీ, ముంబై: మొండిబాకీలకు సంబంధించి సవరించిన సర్క్యులర్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ మే 23 లోగానే విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశలో ఉందని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే తేదీకి ముందే సర్క్యులర్‌ విడుదల కావొచ్చని పేర్కొన్నాయి. రూ. 2,000 కోట్లకు మించిన  మొండిబాకీలపై  ఆర్‌బీఐ గతంలో విడుదల చేసిన ఫిబ్రవరి 12 సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ సవరించిన మార్గదర్శకాలను ప్రకటించాల్సి వస్తోంది. అయితే, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికలకు సంబంధించిన నైతిక నియమావళి అడ్డంకిగా ఉండొచ్చన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. కానీ ఆర్‌బీఐ సర్క్యులర్‌కు ఇది సమస్య కాబోదని, మే 23 (ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే తేది) లోగానే సవరించిన సర్క్యులర్‌ను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

‘నైతిక నియమావళి నుంచి ఆర్‌బీఐ పరపతి విధానానికి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ ఆర్‌బీఐ గానీ సవరించిన సర్క్యులర్‌ విడుదల చేస్తే దానిపై నియమావళి ప్రభావం ఉండబోదు‘ అని వివరించాయి. పాత సర్క్యులర్‌ను పూర్తిగా తిరగరాయకుండా.. కొంత మేర సవరించే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. మొండిబాకీ వర్గీకరణకు 90 రోజుల వ్యవధిని యథాతథంగా ఉంచినప్పటికీ.. దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు అదనంగా మరో 30–60 రోజులు సమయం ఇవ్వొచ్చని తెలుస్తోంది. దీనితో రుణాల చెల్లింపునకు కొంత అదనపు సమయం దొరికితే చిన్న, మధ్య తరహా సంస్థలకు కాస్త ఊరట లభించవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఈ నెల తొలినాళ్లలో సుప్రీం కోర్టు మొండిబాకీలపై సర్క్యులర్‌ను కొట్టివేసింది. ఫలితంగానే ఆర్‌బీఐ కొత్తగా సవరించిన నిబంధనలు ప్రకటించాల్సి వస్తోంది. బ్యాంకులతో పాటు విద్యుత్‌ రంగ సంస్థలు మొదలైన పరిశ్రమ వర్గాలన్నింటి అభిప్రాయాలను సేకరించి ఆర్‌బీఐ వీటిని రూపొందిస్తోంది.

మరిన్ని వార్తలు