రూ. 50 కోట్ల ప్రీమియంతో ఎల్ఐసీ పాలసీ!

12 Dec, 2016 15:03 IST|Sakshi
రూ. 50 కోట్ల ప్రీమియంతో ఎల్ఐసీ పాలసీ!
పెద్దనోట్ల రద్దుతో ఎల్ఐసీకి బంపర్ చాన్స్ తగిలింది. ముంబైలోని దాదర్ బ్రాంచిలో ఇప్పటివరకు దేశచరిత్రలోనే ఎన్నడూ లేనంత అతి పెద్ద పాలసీ అమ్ముడైంది. దాని ప్రీమియమే 50 కోట్ల రూపాయలు! జీవన్ అక్షయ్ పాలసీ కోసం ఒక వ్యక్తి ఈ రికార్డు స్థాయి ప్రీమియం చెల్లించాడు. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడని తెలిసింది. కోట్లాది రూపాయల విలువ చేసే పాలసీలు తీసుకునే వ్యాపారవేత్తలు చాలామందే ఉంటారు. ఒక ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అయితే.. ప్రతియేటా తనకు దాదాపు రూ. 15 లక్షలు వచ్చేలా రూ. 2 కోట్లతో ఓ పెన్షన్ పాలసీ తీసుకున్నాడు. అతడి వివరాలు సోషల్ మీడియాలో లీకవ్వడంతో.. సదరు బ్రాంచి అధికారులను ఎల్ఐసీ వివరణ కోరినట్లు సమాచారం. 
 
ఈ పాలసీకి నవంబర్ 30వ తేదీతోనే గడువు ముగిసిపోవడంతో రికార్డు స్థాయిలో ఆదరణ లభించిందంటున్నారు. ఈ ప్లాన్ కింద ఎల్ఐసీ ఏకంగా రూ. 2,300 కోట్ల నిధులను సాధించగలిగింది. చిన్న మొత్తాల పొదుపుతో పోలిస్తే రిటర్న్ అంత గొప్పగా లేకపోవడంతో మొదట్లో ఈ పాలసీ వైపు జనం పెద్దగా మొగ్గు చూపించలేదు. కానీ, పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులలో వడ్డీరేట్లు తగ్గడంతో.. మళ్లీ ఈ పాలసీకి ఆకర్షితులయ్యారు. 
మరిన్ని వార్తలు