డీఎల్‌ఎఫ్‌కు ‘శాట్’ ఊరట

14 Mar, 2015 01:26 IST|Sakshi
డీఎల్‌ఎఫ్‌కు ‘శాట్’ ఊరట

సెబీ మూడేళ్ల నిషేధం ఆదేశాల కొట్టివేత
న్యూఢిల్లీ: ఐపీవో అవకతవకలకు గాను మూడేళ్ల పాటు మార్కెట్ లావాదేవీలు జరపకుండా నిషేధాన్ని ఎదుర్కొంటున్న రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కు ఊరట లభించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విధించిన నిషేధాన్ని త్రిసభ్య సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్) ‘మెజారిటీ ఆర్డరు’తో కొట్టి వేసింది. అలాగే, కంపెనీ చైర్మన్ కేపీ సింగ్ సహా ఆరుగురు అధికారులపై నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఇందుకు సంబంధించిన ఆదేశాలు వెలువడ్డాయి.

సెబీ నిషేధాన్ని తోసిపుచ్చుతూ శాట్‌లో ఇద్దరు సభ్యులు (జోగ్ సింగ్, ఏఎస్ లాంబా) మెజారిటీ ఆర్డరు ఇచ్చారు. కానీ, అందుకు భిన్నంగా నిషేధాన్ని మూడేళ్ల నుంచి ఆరు నెలలకు తగ్గిస్తూ శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జేపీ దేవధర్ ఆదేశాలు ఇచ్చారు. నిషేధం తొలగింపుపై భిన్నాభిప్రాయాల కారణంగా మెజారిటీ ఉత్తర్వులపై నాలుగు వారాల స్టే విధించాలన్న దేవధర్ సూచనను మిగతా ఇద్దరు సభ్యులూ తోసిపుచ్చారు.
 
ఏడేళ్ల క్రితం రూ. 9,000 కోట్ల ఐపీవో విషయంలో కీలకమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టి ఉంచారన్న ఆరోపణలపై డీఎల్‌ఎఫ్ కంపెనీతో పాటు చైర్మన్ సహా ఆరుగురిపై 2014లో సెబీ మూడేళ్ల నిషేధం, రూ. 86 కోట్ల జరిమానా విధించింది. కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగుల భార్యలతో షేర్ల కొనుగోళ్లు జరిపించడం ద్వారా మోసపూరిత లావాదేవీలకు తెరతీసిందని ఆరోపించింది. దీన్నే సవాలు చేస్తూ డీఎల్‌ఎఫ్ శాట్‌ను ఆశ్రయించగా తాజా ఆదేశాలు వెలువడ్డాయి. మరోవైపు, శాట్ ఉత్తర్వులను డీఎల్‌ఎఫ్ స్వాగతించింది.  
 
 శాట్ నుంచి అనుకూల ఆదేశాలతో శుక్రవారం బీఎస్‌ఈలో డీఎల్‌ఎఫ్ షేరు 6 శాతం ఎగిసి రూ. 157.5 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు