దేశంలో బంగారానికి ‘రూపాయి’ మద్దతు!

10 Sep, 2018 00:13 IST|Sakshi

అంతర్జాతీయంగా తగ్గినా... దేశంలో పటిష్టం!

కరెన్సీ బలహీనత నేపథ్యం

కొనుగోళ్లకు తగిన సమయమే!  

అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో పసిడి  ఔన్స్‌ (31.1గ్రా) ధర గడిచిన నెల రోజులుగా 1,200 డాలర్ల వద్ద కదలాడుతోంది. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్‌లో 1,202 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ కూడా దాదాపు 95 స్థాయిలో ఉండడం దీనికి నేపథ్యం. పసిడికి ప్రస్తుత ధర అంతర్జాతీయంగా పటిష్ట మద్దతు స్థాయని అభిప్రాయం. ఇక భారత్‌లోనూ భారీగా తగ్గే అవకాశాలు ఏవీ కనిపించడం లేదు. 

విశ్లేషకుల అంచనాల ప్రకారం– 1,200 డాలర్ల  ధర పసిడి ఉత్పత్తిదారులకు కొంత లాభదాయకమైనదే. అయితే ఈ స్థాయికన్నా కిందకు పడితే, ఉత్పత్తి... అందుకు అనుగుణంగా సరఫరాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే పసిడికి డిమాండ్‌ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుత శ్రేణిలో మరో ఐదారు నెలలు 40 డాలర్ల అటు– ఇటుగా పసిడి కదలికలు జరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. టెక్నికల్‌గా చూసినా, ఫండమెంటల్‌గా చూసినా, నిర్వహణా పరంగా అలోచించినా పసిడి ప్రస్తుతం ‘‘స్వీట్‌ స్టాప్‌’’అన్నది వాదన.  

దేశీయంగా చూస్తే...
అంతర్జాతీయంగా పసిడి బలహీనపడినా.. దేశీయంగా ఆ ప్రభావం కనిపించని పరిస్థితి ఉంది. రూపాయి బలహీనధోరణి దీనికి నేపథ్యం. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో శుక్రవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 72.10 వద్ద ముగిసింది. ముంబై స్పాట్‌ మార్కెట్‌లో 99.9, 99.5 స్వచ్ఛత 10 గ్రాముల ధరలు శుక్రవారంతో ముగిసిన వారంలో స్వల్పంగా పెరిగి రూ.30,580, రూ.30,430 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ.36,480 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు