సర్జికల్ స్ట్రైక్స్ ఎఫెక్ట్..రూపాయి 39 పైసలు పతనం

30 Sep, 2016 00:55 IST|Sakshi
సర్జికల్ స్ట్రైక్స్ ఎఫెక్ట్..రూపాయి 39 పైసలు పతనం

3 నెలల్లో అత్యధిక ఒక్కరోజు పతనం ఇదే
ముంబై: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేయడంతో డాలర్‌తో రూపాయి మారకం భారీగా క్షీణించింది. రూపాయి 39 పైసలు పతనమై 66.85 వద్ద ముగిసింది. రూపాయి 0.59 శాతం నష్టపోయింది. మూడు నెలల కాలంలో ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తీవ్రంగా ప్రభావితం కాగలదన్న ఆందోళన నెలకొన్నది.

నెల చివర కావడంతో ఆయిల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, దిగుమతిదారుల హెడ్జింగ్ వ్యూహం... రూపాయి భారీ పతనానికి ఆజ్యం పోశాయని నిపుణులంటున్నారు. ఫారెక్స్ మార్కెట్లో బుధవారం నాటి ముగింపు(66.46)తో పోల్చితే 66.44 వద్ద రూపాయి మారకం గురువారం ఉదయం లాభాల్లోనే ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభం కావడం, బ్యాంక్‌లు, ఎగుమతిదారులు నిలకడగా డాలర్లను విక్రయించడంతో మరింతగా లాభపడి 66.42కు చేరింది.

పాక్‌పై దాడుల విషయం తెలియగానే స్టాక్ మార్కెట్ పతనమైంది. ఆ ప్రభావంతో రూపాయి కూడా కుదేలైంది. ఇంట్రాడేలో 66.92 కనిష్ట స్థాయిని తాకి చివరకు 66.85 వద్ద ముగిసింది. ఆర్‌బీఐ తరపున ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రంగంలోకి దిగడంతో నష్టాలు తగ్గాయని కరెన్సీ డీలర్లు పేర్కొన్నారు.

మిడ్‌క్యాప్, స్మాల్ షేర్లకు గట్టి దెబ్బ...
లార్జ్‌క్యాప్ షేర్లతో పోలిస్తే చిన్న షేర్లకు గట్టి దెబ్బ తగిలింది. రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడి చేసే షేర్లు పెద్ద క్షీణతను చవిచూసాయి. ప్రధాన సూచీల పతనం 2 శాతంలోపే వుండగా, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 4 శాతం వరకూ పడిపోయాయి. 82 షేర్లు కలిగిన బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 3.6% క్షీణించింది. ఈ సూచీలోని జీఎంఆర్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ కమ్యూనికేషన్, జిందాల్ స్టీల్, రిలయన్స్ ఇన్‌ఫ్రాలు 8-10 శాతం మధ్య పతనమయ్యాయి.

అదాని ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ పవర్, అదాని పవర్ తదితర షేర్లు కూడా భారీస్థాయిలోనే తగ్గాయి. 761 షేర్లు కలిగిన స్మాల్‌క్యాప్ సూచి 4 శాతం తగ్గింది. ఈ సూచీలో భాగమైన సిగ్నెట్ ఇండస్ట్రీస్, డెల్టాకార్ప్, యాడ్‌లాబ్స్, ఆప్‌టెక్, వెల్‌స్పన్, లైకోస్ తదితర షేర్లు లోయర్ సర్క్యూట్ బాండ్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి.

మరిన్ని వార్తలు