ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్లు 0.40% కోత

28 May, 2020 04:19 IST|Sakshi

నెల్లో ఇది రెండవసారి

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అన్ని కాలపరిమితుల స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 40 బేసిస్‌ పాయింట్ల (0.40 శాతం) వరకూ తగ్గించింది. డిపాజిట్లపై ఎస్‌బీఐ రేట్లు తగ్గించడం ఇది వరుసగా రెండవసారి. తాజా నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. రెండు కోట్లు ఆపైబడిన బల్క్‌ డిపాజిట్లపై వడ్డీరేటును బ్యాంక్‌ ఏకంగా 50 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించడం గమనార్హం. ఈ కేటగిరీ కింద బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తున్న గరిష్ట వడ్డీరేటు మూడు శాతం. ఈ నిర్ణయం కూడా తక్షణం అమలోకి వచ్చింది.

సీనియర్‌ సిటిజన్లకు అదనం..
సీనియర్‌ సిటిజన్లకు పైన పేర్కొన్న వడ్డీరేటు కన్నా అరశాతం (50 బేసిస్‌ పాయింట్లు) అదనంగా అందుతుంది. సీనియర్‌ సిటిజన్ల విషయంలో 50 బేసిస్‌ పాయింట్ల అదనంతోపాటు, మరో 30 బేసిస్‌ పాయింట్ల వడ్డీరేటు ప్రీమియంగా ఇచ్చే ఒక ప్రత్యేక పథకాన్ని ‘ఎస్‌బీఐ వెల్‌ఫేర్‌’ పేరుతో ఇప్పటికే బ్యాంక్‌ ప్రకటించింది. ఐదేళ్లు, ఆపైన డిపాజిట్లకు వర్తించే ఈ పథకాన్ని తీసుకోడానికి గడువు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30.

ఎస్‌ఎంఎస్‌కు ‘ఎస్‌’ అంటే... వాయిదా
కాగా రుణ బకాయిల ఈఎంఐ చెల్లింపులపై మారటోరియం అమలు విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. దీని ప్రకారం... దాదాపు 85 లక్షల మంది అర్హత కలిగిన రుణ గ్రహీతలకు వారి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఎస్‌ఎంఎస్‌ కమ్యూనికేషన్‌కు ప్రతిగా కస్టమర్‌ ‘ఎస్‌’ అని సమాధానం ఇస్తే చాలు... నెలవారీ చెల్లింపులపై మారిటోరియం వారికి అమలవుతుంది.

రేట్ల కోత ప్రయోజనం దక్కట్లేదు
కస్టమర్లు, డెవలపర్లకు బదలాయించడం లేదు...
బ్యాంకులపై ఆర్‌బీఐకి క్రెడాయ్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గినప్పటికీ బ్యాంకులు ఆ ప్రయోజనాలను కస్టమర్లు, నిధుల కొరతతో కటకటలాడుతున్న డెవలపర్లకు బదలాయించడం లేదంటూ రియల్టీ సంస్థల సమాఖ్య క్రెడాయ్‌ తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌కు ఫిర్యాదు చేసింది. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల నిధుల అవసరాలకు కీలకమైన నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్‌ఎఫ్‌సీ) కూడా రేట్ల కోత ప్రయోజనాలను బ్యాంకులు అందించేలా చూడాలంటూ కోరింది. ఆర్‌బీఐకి క్రెడాయ్‌ ఈ మేరకు లేఖ రాసింది.

ప్రస్తుత సంక్షోభ సమయంలో వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూసేందుకు వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు రుణాల చెల్లింపుపై మారటోరియం వంటి చర్యలు కూడా తీసుకున్నప్పటికీ రియల్టీ రంగానికి మాత్రం ఆ ప్రయోజనాలేమీ దక్కడం లేదని క్రెడాయ్‌ పేర్కొంది. ‘2019 జనవరి నుంచి ఆర్‌బీఐ 2.50 శాతం మేర రెపో రేటును తగ్గించింది. కానీ గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటిదాకా బ్యాంకులు గరిష్టంగా 0.7–1.3 శాతం స్థాయిలో మాత్రమే బదలాయించాయి’ అని క్రెడాయ్‌ పేర్కొంది.  

అధిక వడ్డీ రేటు కట్టాల్సి వస్తోంది..
గృహ రుణాలపై వడ్డీ రేట్లను ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌కు అనుసంధానించాలని బ్యాంకులకు సూచించినా ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలకు మాత్రం ఆర్‌బీఐ దీన్ని వర్తింపచేయడం లేదని తెలిపింది. బ్యాంకులు సైతం తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనాలను ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలకు ఇవ్వకపోతుండటంతో వాటి నుంచి తాము తీసుకునే రుణాలపై భారీ వడ్డీ రేటు కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా