కస‍్టమర్లకు ఊరట : ఎస్‌బీఐ కొత్త ఫీచర్‌

16 Mar, 2019 16:55 IST|Sakshi

కార్డు లేకపోయినా.. క్యాష్‌

స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలకు చెక్‌

సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ ఫీచర్. డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ యోనోపై ‘యోనో క్యాష్‌’ను లాంచ్‌ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా16,500కు పైగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలలో డెబిట్‌ కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ చేసు​కోవచ్చని బ్యాంక్‌ తెలిపింది. ప్రధానంగా కార్డు ద్వారా నగదు ఉపసంహరణ, వినియోగంలో చోటుచేసుకుంటున్న​మోసాలకు చెక్‌ చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలోనే ఇటువంటి సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్‌ తమదేనని ఎస్‌బీఐ  ప్రకటించింది.  ఈ సదుపాయం కలిగిన ఏటీఎంలను ‘యోనో క్యాష్‌ పాయింట్‌’గా  వ్యవహరిస్తారు. కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది. యోనో యాప్‌లో యోనో క్యాష్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ సాధ్యమవుతుంది. 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా యోనో యాప్‌పై ఎస్‌బీఐ ఖాతాదారులు కార్డురహిత నగదు ఉపసంహరణకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది.

నగదు తీసుకునే విధానం 
యాప్‌లో అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి
6 అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి
అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది.
ఈ నెంబర్ కేవలం 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది.
సమీపంలోని యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి
ఎస్ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి.
యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి.
తరువాత యాప్‌లో క్రియేట్‌ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ వినియోగదారులకు బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత  మెరుగుపర్చడమే  తమ లక్ష్యమని ఎస్‌బీఐ  ఛైర్మన్  రజినీష్‌ కుమార్ చెప్పారు.  

మరిన్ని వార్తలు