మొండిబాకీలే టార్గెట్‌!

6 Oct, 2017 13:14 IST|Sakshi

వీటి పరిష్కారానికే ప్రాధాన్యం

లాభదాయకత మెరుగుదలపైనా దృష్టి

ఇన్‌ఫ్రా, రిటైల్‌ రంగాల్లో ఫైనాన్సింగ్‌కు అవకాశాలు

ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌

ముంబై: కొండలా పేరుకుపోయిన మొండిబకాయిల సమస్యను సత్వరం పరిష్కరించడం, లాభదాయకతను మెరుగుపర్చడమే తన ముందున్న ప్రధాన లక్ష్యాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త చైర్మన్‌గా నియమితులైన రజనీశ్‌ కుమార్‌ చెప్పారు. రాబోయే రోజుల్లో ఎన్‌పీఏలు తగ్గుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘మొండిబాకీల సమస్యను పరిష్కరించడానికి బ్యాంకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది.

ఇది ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేది కావడంతో.. అత్యవసర ప్రాతిపదికన దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది‘ అని విలేకరుల సమావేశంలో రజనీశ్‌ తెలిపారు. ‘కార్పొరేట్ల రుణాలపై తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు బ్యాంకు ఇప్పటికే కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి సానుకూల పరిణామాలు చూడొచ్చు‘ అని చెప్పారు. ప్రస్తుతం రిటైల్‌ బ్యాంకింగ్‌ విభాగం ఎండీగా ఉన్న రజనీష్‌ కుమార్‌ (59).. ఎస్‌బీఐ 25వ చైర్మన్‌గా బుధవారం నియమితులైన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 7న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.

ఈ ఏడాది జూన్‌ ఆఖరు నాటికి ఎస్‌బీఐ స్థూల మొండి బాకీలు (ఎన్‌పీఏ) 7.40 శాతం నుంచి 9.97 శాతానికి, నికర ఎన్‌పీఏలు 4.36 శాతం నుంచి 5.97 శాతానికి ఎగిశాయి. రిటైల్‌ ఎన్‌పీఏలు 1.56 శాతం పెరిగి రూ.7,632 కోట్లకు, వ్యవసాయ రుణాల్లో నిరర్ధక ఆస్తులు 9.51% ఎగిసి రూ. 17,988 కోట్లకు చేరాయి.

ప్రస్తుత చైర్మన్‌ అరుంధతీ భట్టాచార్య స్థానంలో బ్యాంకు పగ్గాలు చేపడుతున్న కుమార్‌ తక్షణం ఎదుర్కొనబోయే సవాలు మొండిబాకీల పరిష్కారమేనని విశ్లేషకులు, ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ తరచూ మారిపోతుండటం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొనే పెద్ద సమస్యని, అయితే ఎన్‌పీఏల పరిష్కారంపై జరిగిన చర్చల్లో కుమార్‌ కూడా ఇప్పటికే పాలుపంచుకుని ఉండటం వల్ల మొండిబాకీల సమ స్య ఆయనకు కొత్తది కాబోదని వారి అభిప్రాయం.

డిపాజిట్లనూ బెంచ్‌మార్క్‌ రేటుకు అనుసంధానించాలి..
ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను మరింత ప్రభావవంతంగా అమలు చేసే దిశగా ఇతర బెంచ్‌మార్క్‌ రేట్లను ప్రవేశపెట్టాలన్న ఆర్‌బీఐ ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నట్లు కుమార్‌ తెలిపారు. అయితే, రుణాలకు మాత్రమే కాకుండా డిపాజిట్లను కూడా సదరు బెంచ్‌మార్క్‌ రేటుకు అనుసంధానించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. లేకపోతే సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.

‘ఒకవేళ రుణ వితరణ వ్యయాలు అధిక స్థాయిలో ఉంటే.. వాటిని తట్టుకునేందుకు బ్యాంకులకు తగినంత నికర వడ్డీ మార్జిన్లు (నిమ్‌) కూడా ఉండాలి. అందుకే రుణాలనే కాకుండా డిపాజిట్లను కూడా బెంచ్‌మార్క్‌ రేటుకు అనుసంధానించాల్సి ఉంటుంది. వ్యవస్థ ఒత్తిడిలో ఉండి, రుణ వితరణ వ్యయాలూ పెరిగితే.. ఇక వడ్డీ మార్జిన్లను తగ్గించుకునే అవకాశం ఉండదు.

దాన్ని తగ్గించుకుంటే వ్యయాలను ఎలా భర్తీ చేసుకోగలుగుతాం, మొండిబాకీలకు కేటాయింపులు ఎలా చేయగలుగుతాం? కాబట్టే ఆస్తులు, అప్పులనూ బెంచ్‌మార్క్‌ రేటుకు అనుసంధానించాల్సి ఉం టుంది‘ అని రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.


బ్యాంకు పటిష్టానికి కసరత్తు..
కేవలం బ్యాంకు పరిమాణాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఆర్థికంగా మరింత పటిష్టం చేయడంపైనా దృష్టి సారించనున్నట్లు కుమార్‌ చెప్పారు. ‘గడిచిన కొన్నాళ్లుగా ప్రొవిజనింగ్‌ అవసరాల కారణంగా బ్యాంకు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతూ వచ్చింది. ఇకపై బ్యాంకు వ్యాపార పరిమాణంపరంగా ఎదగడం మాత్రమే కాకుండా లాభదాయకతను కూడా పెంచుకునేలా  కృషి చేస్తాము‘ అని ఆయన వివరించారు.

ఇందులో భాగంగా మధ్య స్థాయి మేనేజ్‌మెంట్‌ బృందంలో కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేపట్టొచ్చని కుమార్‌ సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం సిబ్బంది సమయం చాలామటుకు మొండిబాకీల సమస్యల పరిష్కారానికే వెచ్చించాల్సి వస్తోందని ఆయన తెలిపారు. దీన్ని సరిచేసే దిశగా రాబోయే రోజుల్లో మొండిబాకీల పర్యవేక్షణకోసం ఒక బృందాన్ని, రుణవితరణ కార్యకలాపాల కోసం మరో టీమ్‌ను ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు.

రుణ వితరణకు సంబంధించి రిటైల్, మౌలిక రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని కుమార్‌ చెప్పారు. ‘అండర్‌రైటింగ్‌ ప్రమాణాలు చాలామటుకు మారాయి. మేము మరింత జాగ్రత్త వహించనున్నాం.  ఇప్పటికీ మంచి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రుణాలందించే అవకాశాలు పరిశీలిస్తూనే ఉన్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత మూలధనంతో రుణాల వృద్ధి మెరుగుపర్చుకోగలమని, 2019 మార్చి దాకా తమకు మరింత మూలధనం అవసరం ఉండబోదని కుమార్‌ వివరించారు.

మరిన్ని వార్తలు