100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌

29 Jun, 2018 09:34 IST|Sakshi

ముంబై : వారమంతా నేల చూపులు చూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, వారం చివరి ట్రేడింగ్‌లో పైకి ఎగిశాయి. శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం 136 పాయింట్ల లాభంలో 35,173 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 47 పాయింట్ల లాభంలో 10,600కి పైన 10,635 వద్ద కొనసాగుతోంది. ఆసియన్‌ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలు, జూలై సిరీస్‌ నేటి నుంచి ప్రారంభం కావడం మార్కెట్లను నష్టాల నుంచి లాభాల్లోకి ఎగిసేలా చేశాయి.

టెక్‌ మహింద్రా, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, టైటాన్‌ కంపెనీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌ ప్రారంభంలో ఎక్కువగా లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఎన్‌టీపీసీ, ఆసియన్‌ పేయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు ఒత్తిడిలో కొనసాగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ సైతం 150 పాయింట్లు జంప్‌చేయగా.. నిఫ్టీ బ్యాంక్‌ 33 పాయింట్లు లాభపడింది. గత రెండు రోజులుగా భారీగా పతనమవుతున్న డాలర్‌తో రూపాయి విలువ ప్రస్తుతం స్వల్పంగా 3 పైసలు బలహీనపడి 68.67 వద్ద ట్రేడవుతోంది. ప్రారంభంలో రూపాయి విలువ 15 పైసలు లాభపడింది. 

మరిన్ని వార్తలు