నిఫ్టీకి 10536-10602 వద్ద రెసిస్టెన్స్‌!

24 Jun, 2020 08:27 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 8 పాయింట్లు మైనస్‌

యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్లు అప్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సానుకూలం

నేడు లాభాల స్వీకరణకు చాన్స్‌: నిపుణులు

నేడు (24న) దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ కేవలం 8 పాయింట్లు బలహీనపడి 10,472 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జూన్‌ నెల ఫ్యూచర్స్‌ 10,480 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే.  ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు అండగా నిలవడంతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో లాభపడ్డాయి. ఫాంగ్‌(FAANG) స్టాక్స్‌ అండగా నిలుస్తుండటంతో నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాలను తాకుతోంది. అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లు 1.2-2 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. అయితే నాలుగు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో నేడు లాభాల స్వీకరణకు వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గురువారం(25న) జూన్‌ డెరివేటివ్స్‌ ముగియనున్న నేపథ్యంలో కొంతమేర ఆటుపోట్లను చవిచూడవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా..మంగళవారం వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపాయి. సెన్సెక్స్‌ 519 పాయింట్లు జంప్‌చేసి 35,430 వద్ద నిలవగా.. 160 పాయింట్లు జమ చేసుకున్న నిఫ్టీ 10,471 వద్ద స్థిరపడింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సమయం గడిచేకొద్దీ మార్కెట్లు బలపడుతూ వచ్చాయి.


నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,354 పాయింట్ల వద్ద, తదుపరి 10,236 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,536 పాయింట్ల వద్ద, ఆపై  10,602 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,834 పాయింట్ల వద్ద, తదుపరి 21,405 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,509 పాయింట్ల వద్ద, తదుపరి 22,753 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 169 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 454 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 424 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 1,288 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు