రూపీ పతనంతో నష్టాలు

31 Aug, 2018 00:48 IST|Sakshi

భగ్గుమన్న ముడి చమురు ధరలురెండో రోజు కొనసాగిన పతనం ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు కారణంగా ఒడిదుడుకులు33 పాయింట్ల పతనమై 38,690కు సెన్సెక్స్‌15 పాయింట్ల నష్టంతో 11,677కు నిఫ్టీ

రూపాయి పతనానికి, ముడి చమురు ధరలు భగ్గుమనడం కూడా జత కావడంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. ఆగస్టు నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులకు ముగింపు రోజు కూడా కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. వరుసగా రెండో రోజూ స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. ఎఫ్‌ అండ్‌ ఓ సెగ్మెంట్లో ఎక్కువ మంది ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్లను రోల్‌ఓవర్‌ చేయకుండా ఆఫ్‌లోడ్‌ చేయడం వల్ల స్టాక్‌ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే చివరి గంటలో రికవరీ కారణంగా నష్టాలు తగ్గాయి. అయినప్పటికీ, నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువనే ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 33 పాయింట్లు నష్టపోయి 38,690 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్ల పతనంతో 11,677 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ, ఫార్మా, ఐటీ, పెరగ్గా, వాహన, ఆర్థిక, ఇంధన షేర్లు కుదేలయ్యాయి. ఆగస్టు సిరీస్‌లో నిఫ్టీ 5 శాతం, సెన్సెక్స్‌ 7 శాతం చొప్పున ఎగిశాయి. 

నేడు జీడీపీ గణాంకాలు.... 
డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో జీవిత కాల కనిష్ట స్థాయి, 70.90కు పడిపోయింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 77 డాలర్లకు పెరిగాయి. అమెరికా చమురు నిల్వలు పడిపోవడం, ఇరాన్, వెనుజులా దేశాల నుంచి చమురు సరఫరాల్లో అవాంతరాలు ఏర్పడతాయనే అంచనాల కారణంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఈ ఏడాది జూన్‌ క్వార్టర్‌ జీడీపీ గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం వెల్లడించనున్నది. మార్కెట్‌ భవిష్యత్తు ట్రెండ్‌ను నిర్ధారించే అంశాల్లో ఈ గణాంకాలు కూడా ఒకటి అని నిపుణులంటున్నారు. 

237 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌
సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ప లాభాలతో ఆరంభమైనా, అమ్మకాల జోరుతో వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. చివర్లో నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 96 పాయింట్లు లాభపడగా, మరో దశలో 141 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ రోజంతా 237 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 52 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఇక ఆసియా మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయి, మిశ్రమంగా ముగియగా, యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి.

►రూపాయి పతనం కారణంగా ఆదాయం పెరుగుతుందనే అంచనాలతో సన్‌ ఫార్మా షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఈ షేర్‌ 3 శాతం లాభంతో రూ. 640వద్ద ముగిసింది. సన్‌ ఫార్మా షేర్‌కు అంతర్జాతీయ రీసెర్చ్‌ సంస్థ, క్రెడిట్‌ సూసీ అవుట్‌ ఫెర్ఫామ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తూ, టార్గెట్‌ ధరను రూ.705కు పెంచడం కూడా సానుకూల ప్రభావం చూపించింది. 
►ఐటీసీ 2% లాభంతో రూ.320కు ఎగసింది. ఇది ఈ షేర్‌కు తాజా ఏడాది గరిష్ట స్థాయి. ఈ షేర్‌ త్వరలో రూ.360ను చేరుతుందని, ఈ ధరలో కొనుగోలు చేయవచ్చని బీఓఏ–ఎంఎల్‌ సిఫార్సు. 
►రిలయన్స్‌ ఎనర్జీ విక్రయం పూర్తవ్వడంతో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్‌ 5.5 శాతం లాభపడి రూ.463 వద్ద ముగిసింది. 
►విలీన బ్యాంక్‌ల జాబితా తయారు చేయాలని ఆర్‌బీఐని ప్రభుత్వం ఆదేశించిందన్న వార్తల కారణంగా కొన్ని ప్రభుత్వ రంగ షేర్లు 10 శాతం వరకూ పెరిగాయి. యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దేనా బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్, సిండికేట్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లు 1–4% రేంజ్‌లో పెరిగాయి.
►ముడిచమురు ధరలు పెరగడంతో విమానయాన రంగం షేర్లు నష్టపోయాయి. ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్‌ 3  నుంచి 5 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి. 
►ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.6 శాతం నష్టంతో రూ.1,876 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

మరిన్ని వార్తలు