మాది చేతల ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

మాది చేతల ప్రభుత్వం

Published Fri, Aug 31 2018 12:49 AM

harish rao commented over congress - Sakshi

జహీరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్‌ నేతలకు కనిపించడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కంటి వెలుగు పథకంలో తమ కళ్లను పరీక్ష చేయించుకుని, పొరలను తొలగించుకోవాలని హితవు పలికారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గురువారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంటు పోతుందని, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా అందించదని అన్నారు. మరో పదేళ్ల పాటు రాష్ట్రంలో తామే అధికారంలో ఉంటామన్నారు. కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు. 65 సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి కేవలం నాలుగున్నరేళ్లలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. దీంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తున్నారన్నారు.  

రేషన్‌ డీలర్లకు రూ.140 కోట్లు..
రేషన్‌ డీలర్ల కష్టాలను దూరం చేసేందుకు వారికి ఇచ్చే కమీషన్‌ను 70 పైసలకు పెంచామన్నారు. ఇందుకోసం రూ.140 కోట్ల కమీషన్‌ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. 32 నెలలకు సంబంధించి లెక్కకట్టి మరీ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో జహీరాబాద్‌ నుంచే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖాళీ సంచులు కూడా వారికే వదిలి పెడుతున్నామన్నారు. కాగా, పేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు వీలుగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటికే 30 ఎస్సీ రెసిడెన్షియల్‌ కళాశాలలు ఏర్పాటయ్యాయని, అదే కాంగ్రెస్‌ హయాంలో ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఎస్టీల కోసం 20 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో 273 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉంటే 604కు పెంచామన్నారు. ఉత్తమ విద్యతో పాటు మంచి భోజనం అందిస్తున్నామన్నారు. కార్పొరేట్‌ కంటే ఉత్తమ సదుపాయాలు కల్పించామన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే పేద వారికి కూడా ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి హరీశ్‌ వెల్లడించారు. 2021 నాటికి రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చదివేందుకు వీలుగా చర్యలు చేపట్టామన్నారు.  

గ్రామ సంఘాలకు ట్యాబ్‌లు..
మహిళలు వడ్డీలేని రుణం అడుగుతున్నారని, వారి కోరిక మేరకు రాష్ట్రంలో రూ.1,650 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేశారని హరీశ్‌ పేర్కొన్నారు. వడ్డీ మాఫీని వారి ఖాతాల్లో జమచేయడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామ సంఘానికి ఒక ట్యాబ్‌ను అందిస్తున్నామని, సంఘం సభ్యులు తమకు సంబంధించిన వివరాలను ఇంటి వద్దే కూర్చుని ట్యాబ్‌లో చూసుకోవచ్చన్నారు. పలు సంఘాలకు సొంత భవనాలను కట్టిస్తున్నామన్నారు.

రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని ఇప్పటికే 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, పెట్టుబడి సహాయం కింద ఎకరాకు రూ.8 వేలు, అలాగే రైతు బీమా కల్పించినట్లు వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాలకు మిషన్‌ భగీరథ పథకం కింద నీటిని అందిస్తామన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement