ఫలితాలు.. టీసీ‘ఎస్‌’!

13 Oct, 2017 08:16 IST|Sakshi

క్యూ2లో నికర లాభం రూ. 6,446 కోట్లు

 4% వృద్ధితో రూ. 30,541 కోట్ల ఆదాయం

 ఒక్కో షేర్‌కు రూ. 7 మధ్యంతర డివిడెండ్‌.. రికార్డు తేదీ ఈ నెల 26

ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌ (క్యూ2)లో కంపెనీ రూ.6,446 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో సాధించిన నికర లాభం రూ.6,586 కోట్లతో పోలిస్తే 2 శాతం క్షీణత నమోదయింది.

అయితే  సీక్వెన్షియల్‌గా చూసినపుడు కంపెనీ నికర లాభం 8.4 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో ఈ కంపెనీ రూ.5,945 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ2లో రూ.29,284 కోట్లుగా ఉన్న ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.30,541 కోట్లకు పెరిగింది.  ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఆదాయంతో పోల్చితే 3 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. ఇక డాలర్లలో ఆదాయం 3.2 శాతం వృద్ధితో 474 కోట్ల డాలర్లకు పెరిగింది.

మరోవైపు ఈ క్యూ2లో రూ.30,356 కోట్ల ఆదాయంపై రూ.6,188 కోట్ల నికర లాభం రాగలదని విశ్లేషకులు అంచనా వేశారు. నిర్వహణ మార్జిన్‌ 170 బేసిస్‌పాయింట్లు పెరిగి 25.1 శాతానికి చేరింది. 26–28 శాతం గైడెన్స్‌ కష్టమైనప్పటికీ, సాధించే ప్రయత్నాలు చేస్తామని టీసీఎస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వి. రామకృష్ణన్‌ చెప్పారు.

రూ.7 డివిడెండ్‌
ఒక్కో షేర్‌కు రూ.7 రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ పేర్కొంది. ఈ డివిడెండ్‌కు రికార్డ్‌ డేట్‌ను ఈ నెల 26గా నిర్ణయించామని తెలిపింది. ఇక ఉద్యోగుల ఆట్రిషన్‌ రేటు 0.3% క్షీణించి 11.3%కి తగ్గిందని, మొత్తం ఆట్రిషన్‌ రేటు 12.1%గా ఉందని కంపెనీ తెలియజేసింది.

సెప్టెంబర్‌ క్వార్టర్లో నికరంగా 3,404 మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చామని, దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,89,213కు పెరిగిందని రామకృష్ణన్‌ చెప్పారు. భారత్‌ వెలుపల 3,725 మందికి ఉద్యోగాలిచ్చామని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వెలుపల ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 6,979కి చేరిందని తెలిపారు.

డిజిటల్‌ జోరు...
వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ విభాగంలో మరింత మార్కెట్‌ వాటా సాధించనున్నట్లు రామకృష్ణన్‌ చెప్పారు. ‘‘ఈ క్యూ2లో డిజిటల్‌ ఆదాయం 31 శాతం పెరిగింది. మొత్తం ఆదాయంలో డిజిటల్‌ ఆదాయం వాటా 20 శాతంగా ఉంది’’ అని వివరించారు.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) విభాగంలో 5 కోట్ల డాలర్ల భారీ డీల్‌ను సాధించనున్నట్లు టీసీఎస్‌ సీఈఓ, ఎండీ, రాజేశ్‌ గోపీనాథన్‌ చెప్పారు. 10 కోట్ల డాలర్లకు మించిన డీల్స్‌ విభాగంలో కొత్త క్లయింట్‌ను సాధించామని, అలాగే 5 కోట్ల డాలర్లు, 2 కోట్ల డాలర్లు, కోటి డాలర్ల డీల్స్‌ విభాగాల్లో ఒక్కో విభాగంలో ఆరుగురు చొప్పున కొత్త క్లయింట్లను సాధించామని వివరించారు.

ఏంజెల్‌ బ్రోకింగ్‌ న్యూట్రల్‌ రేటింగ్‌...
కంపెనీ ఫలితాలు అంచనాలను మించాయని దేశీయ బ్రోకరేజ్‌ సంస్థ, ఎంకే గ్లోబల్‌ పేర్కొంది. మార్జిన్లు పెరగడం ఆహ్వానించదగ్గ విషయమని పేర్కొంది. కాగా ఫలితాల నేపథ్యంలో ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఈ షేర్‌కు న్యూట్రల్‌ రేటింగ్‌ను ఇచ్చింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేర్‌ దాదాపు 2 శాతం లాభంతో రూ.2,548 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ రూ.2,507, రూ.2,555 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది.  


ఉద్యోగులను తొలగించం..
వివిధ వ్యాపార విభాగాల్లో మంచి డిమాండ్‌ కనిపించిందని, మంచి అమ్మకాలు సాధించామని టీసీఎస్‌ సీఈఓ, ఎండీ, రాజేశ్‌ గోపీనాధన్‌ చెప్పారు. భారీ డీల్స్‌ సాధించామని, మరిన్ని భారీ డీల్స్‌ సాధించనున్నామని, రిటైల్‌ రంగ మందగమనం ఇక ముగిసినట్లేనని.. ఈ అంశాలన్నీ క్యూ2 ఫలితాలపై సానుకూల ప్రభావం చూపాయని వివరించారు. రానున్న క్వార్టర్లో రిటైల్‌ రంగ విభాగం మెరుగుపడగలదని పేర్కొన్నారు.

కంపెనీకి అధిక ఆదాయం తెచ్చిపెట్టే బీఎఫ్‌ఎస్‌ (బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) విభాగం ఎప్పట్లోగా మెరుగుపడుతుందో చెప్పలేకపోయిన ఆయన, ఈ రంగంపై సానుకూలంగానే ఉన్నామని చెప్పారు. ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీల వల్ల ప్రమాదం ఉంటుందేమోనన్న భయాల నుంచి యూరప్‌ బ్యాంక్‌లు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఉద్యోగులను తొలగించాలన్న అలోచన లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు