వాల్‌మార్ట్‌తో టీఐహెచ్‌సీ ఒప్పందం!

13 Dec, 2019 03:16 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తెలంగాణలో తయారీ రంగంలోని ఖాయిలా పరిశ్రమలను పునరుద్దరించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ (టీఐహెచ్‌సీ) అమెరికాకు చెందిన రిటైల్‌ బహుళ జాతి కంపెనీ వాల్‌మార్ట్‌తో ఒప్పందం చేసుకోనుంది. టీఐహెచ్‌సీలోని ఎంఎస్‌ఈలకు ఆన్‌లైన్‌ వేదికను అందించడంతో పాటు మార్కెటింగ్‌ అవకాశాలను కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని టీఐహెచ్‌సీ అడ్వైజర్‌ డాక్టర్‌ బి. యెర్రం రాజు ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు.

‘‘రూ.100 కోట్ల సోషల్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం పలు విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. రెండేళ్ల లాకిన్‌ పీరియడ్‌తో 7 శాతం డివిడెండ్‌ను కేటాయిస్తాం. వచ్చే 3 నెలల్లో డీల్‌ క్లోజ్‌ చేస్తామని’’ ఆయన పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఖాయిలా పడ్డ 43 ఎంఎస్‌ఎంఈలను పునరుద్ధరించామని... వీటి ద్వారా సుమారు 1,100 మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయని చెప్పారు. ‘ప్రస్తుతం మరొక 12 ఎంటర్‌ప్రైజ్‌లు పునరుద్ధ్దరణ జాబితాలో ఉన్నాయి. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా నారీ పథకాన్ని ఏర్పాటు చేశాం. వార్షిక వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. గరిష్ట రుణం రూ.25 లక్షలు’ అని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు