7,100 దిగువకు నిఫ్టీ లాభాల స్వీకరణతో నష్టాలు

17 Feb, 2016 01:13 IST|Sakshi
7,100 దిగువకు నిఫ్టీ లాభాల స్వీకరణతో నష్టాలు

362 పాయింట్ల నష్టంతో 23,192కు సెన్సెక్స్
115 పాయింట్ల నష్టంతో 7,048కు నిఫ్టీ

 
గత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఎగసిన షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో రెండు ట్రేడింగ్ సెషన్ల లాభాలకు బ్రేక్ పడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,100 పాయింట్ల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు జరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 362 పాయింట్లు నష్టపోయి 23,192 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 115 పాయింట్లు(1.60 శాతం) నష్టపోయి 7,048 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి.

 527 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్
 జనవరిలో ఎగుమతులు 14 శాతం క్షీణించడం,(ఎగుమతులు క్షీణించడం ఇది వరుసగా 14 వ నెల) భారత మౌలిక రంగానికి ఇండియా రేటింగ్స్ సంస్థ నెగిటివ్ అవుట్‌లుక్‌ను ఇవ్వడం, డాలర్‌తో రూపాయి మారకం 31 పైసలు క్షీణించడం... ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్ 23,689 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. 23,692-23,165 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడిన సెన్సెక్స్ చివరకు 362 పాయింట్లు(1.54 శాతం) నష్టపోయి 23,192 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద సెన్సెక్స్ 527 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

 బ్యాంక్ షేర్లు బేర్
 మార్చి క్వార్టర్‌లో కూడా మొండి బకాయిలు  పెరిగే అవకాశాలున్నాయని,  ఫలితంగా లాభాలపై ప్రభావం ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడంతో బ్యాంక్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.  ఎస్‌బీఐ 7 శాతం క్షీణించి రూ.156 వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజే ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ రూ.8,422 కోట్లు హరించుకుపోయింది. సోమవారం 22 శాతం ఎగసిన బ్యాంక్ ఆఫ్ బరోడా 6 శాతం వరకూ క్షీణించింది. పీఎన్‌బీసహా పలు  బ్యాంక్ షేర్లు4-7 శాతం రేంజ్‌లో పడిపోయాయి.

మరిన్ని వార్తలు