కార్పొరేట్‌ వర్గాలకు, పన్ను చెల్లింపుదారులకు ఊరట!

1 Feb, 2020 13:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తద్వారా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. శనివారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా.. ఈ మేరకు... 0 నుంచి 2.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఆదాయపన్ను లేదని, 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం అలాగే ఉంటుందని తెలిపారు. అదే విధంగా.. రూ. 5-7.5 లక్షల వార్షిక ఆదాయంపై ఇప్పటి వరకు ఉన్న పన్నును 20 శాతం నుంచి 10 శాతానికి, రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్నును 20 నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు.. అదే విధంగా రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను, రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు.(బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌)

అయితే, ఆదాయం పన్నును సరళీకరించడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈసారి ఏడు స్లాబుల విధానాన్ని ప్రతిపాదించారు. గతంలో ఐదు స్లాబులు మాత్రమే ఉన్న విషయం తెల్సిందే. ఆదాయం పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త స్లాబుల్లో ఏదోఒక స్లాబును ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి ఐదు లక్షల రూపాయల ఆదాయం వరకు వచ్చేవారు ఏ స్లాబును ఎంపిక చేసుకున్నా ఫర్వాలేదు. ఎందుకంటే రెండింటిలోను వారికి తేడా లేదు. ఏడు స్లాబులు గల కొత్త విధానాన్ని ఎంపిక చేసుకునేవారు 80 సీ, 80 డీ కింద వచ్చే మినహాయింపులను వదులు కోవాల్సి ఉంటుంది. వాటిని వదులుకున్నప్పుడే కొత్త విధానం వర్తిస్తుంది. పన్ను మినహాయింపులు వదులుకోదల్చుకోలేని వారు పాత స్లాబులోనే కొనసాగవచ్చు. ఏది ఏమైనా అది వారి ఐచ్ఛికం. 

అదే విధంగా... కార్పొరేట్‌ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఈ మేరకు కార్పొరేట్‌ ట్యాక్స్‌లను 15 శాతం తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కార్పొరేట్‌ ట్యాక్సులను తగ్గించడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. ప్రపంచంలో అతి తక్కువ కార్పొరేట్‌ పన్నులు ఉన్న దేశం భారత్‌ అని పేర్కొన్నారు. కొత్తగా అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. డివిడెండ్‌ డిస్ర్టిబ్యూషన్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్షియల్‌ కాంట్రాక్ట్‌ల ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు