మీ నెట్‌వర్త్ ఎంత?

26 Oct, 2015 00:31 IST|Sakshi
మీ నెట్‌వర్త్ ఎంత?

ఫైనాన్షియల్ బేసిక్స్
మొత్తం ఆస్తుల విలువలో నుంచి అన్ని రకాల రుణాల విలువను తీసివేస్తే వచ్చే విలువే నెట్‌వర్త్. వ్యక్తులకైనా, సంస్థలకైనా నెట్‌వర్త్‌ను బట్టే ఆ వ్యక్తి లేదా సంస్థకు నికరంగా వున్న ఆస్తి విలువ తెలిసేది.  సంస్థలకు సంబంధించి ఈ నెట్‌వర్త్‌నే పుస్తక విలువ లేదా షేర్‌హోల్డర్ల మూలధనంగా పరిగణిస్తారు.
 
నెట్‌వర్త్ విలువ మీ ఆర్థిక నిర్వహణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే నెట్‌వర్త్ విలువ పెరుగుతూ పోతే అతని ఆర్థిక సామర్థ్యం బాగా ఉన్నట్లు లెక్క. అదే తగ్గుతూ వస్తే.. అతనికి ఆర్థిక లావాదేవీల నిర్వహణపై సరైన నియంత్రణ లేదని అర్థం. అదే ఒక కంపెనీ నెట్‌వర్త్ విలువ (బుక్ వ్యాల్యూ) పెరుగుతూ ఉంటే.. అది మంచి పనితీరును కనబరుస్తోందని తెలుసుకోవాలి. నెట్ వర్త్ విలువ బాగా ఉన్న వ్యక్తికి/కంపెనీకి క్రెడిట్ రేటింగ్ కూడా బాగా ఉంటుంది. నెట్‌వర్త్ అనేది వ్యక్తి/కంపెనీ నిధుల సమీకరణపై ప్రభావాన్ని చూపిస్తుంది.
 
నెట్‌వర్త్‌ను లెక్కించడం ఎలా?
నెట్‌వర్త్ విలువ ఎంతో తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఇళ్లు, కారు, బైక్, ఇన్వెస్ట్‌మెంట్స్, సేవింగ్స్ వంటి అన్ని ఆస్తుల వివరాలతో ఒక జాబితా తయారుచేసుకోవాలి. తర్వాత మీకు ఉన్న బ్యాంకు రుణాలు,  ఇతర  అప్పుల వివరాలతో మరొక జాబితా రూపొందించుకోండి. ఇప్పుడు ఆస్తుల విలువ లో నుంచి రుణ మొత్తాలను తీసివేస్తే మీ నెట్‌వర్త్ విలువ వస్తుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.20,00,000 ఖరీదైన ఇంటిని కలిగి ఉన్నాడు. అలాగే అతనికి రూ.5,00,000 విలువైన పెట్టుబడులు ఉన్నాయి. రూ.4,00,000 విలువైన వాహనం ఉంది. ఇవన్నీ అతని ఆస్తులు. అతను ఇంకా చెల్లించాల్సిన ఇంటి రుణం రూ.10,00,000 వరకూ వుంది. అలాగే అతనికి కారు రుణం రూ.2,00,000 ఉంది. ఇవన్నీ అతని రుణాలు. ఇప్పుడు అతని నెట్‌వర్త్ విలువ (మొత్తం ఆస్తుల విలువ-అన్ని రుణాలు) రూ.17,00,000గా ఉంటుంది.
 
సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతను నివాసం ఉంటున్న ఇంటి విలువ రూ.22,00,000కు పెరిగింది. ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.6,00,000గా, సేవింగ్స్ రూ.1,00,000గా వున్నాయి. వాహనం విలువ రూ.3,00,000కు తగ్గింది. కారు రుణం చెల్లించివేశాడు. ఇంటి రుణం రూ.6,00,000గా ఉంది. దాంతో అతని నెట్‌వర్త్ రూ.26,00,000గా ఉంటుంది. అంటే అతని నెట్‌వర్త్ ఐదేళ్లలో రూ.9,00,000 మేర పెరిగిందన్న మాట.

మరిన్ని వార్తలు