ఇండస్ట్రీలో అలజడి: అమ్మకానికి ఆ టెక్ దిగ్గజం?

6 Jun, 2017 15:39 IST|Sakshi
ఇండస్ట్రీలో అలజడి: అమ్మకానికి ఆ టెక్ దిగ్గజం?
రెవెన్యూల పరంగా అది దేశంలో మూడో అతిపెద్ద  ఐటీ సర్వీసుల కంపెనీ. కానీ గత ఐదేళ్లుగా వృద్ధిని నమోదుచేయడంలో ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంది. ఇక ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో నెలకొన్న తిరోగమన పరిస్థితులు ఆ కంపెనీని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో ఇక ఆ టెక్ దిగ్గజాన్ని అమ్మేయాలని చూస్తున్నారట. విప్రో కంపెనీని లేదా కంపెనీకి చెందిన కొన్ని యూనిట్లను విక్రయించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని, అమ్మడానికి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు  ఓ సరసమైన విలువ వద్దకు చేరుకున్నాయని సీనియర్ బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని స్వయానా మనీ కంట్రోలే రిపోర్టు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ, ఆయన కుటుంబమే విప్రోలో 73 శాతం వాటా కలిగిఉంది.
 
కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగడమా? లేదా కొంతమొత్తంలో విక్రయించాలా? అనే యోచనలో  ఉన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఓ మంచి ధర వస్తే బహుళ జాతీయ ఐటీ సర్వీసు కంపెనీకి లేదా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ కైనా విక్రయించడానికి సన్నద్ధంగా ఉన్నారని, వ్యూహాత్మక కొనుగోలుదారుడు ఎవరు అయి ఉండాలి అని నిర్ణయిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం కంపెనీ ప్రమోటర్లు, బ్యాంకులను ఆశ్రయించినట్టు, ఎంతమొత్తంలో విలువ పొందుతారో తెలుసుకుంటున్నారని ఓ బ్యాంకర్ చెప్పారు  ఒకవేళ ఈ డీల్ కనుక జరిగితే 150 బిలియన్ ఐటీ ఇండస్ట్రీలో అలజడి రేకెత్తబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని విప్రో యాజమాన్యం ఖండిస్తోంది.  సంబంధిత వర్గాల సమాచారం మేరకు కంపెనీ అధికార ప్రతినిధిని ఆశ్రయించగా, ఇవన్నీ నిరాధార రూమర్లేనని కొట్టిపారేశారు.
 
ఇలాంటి తప్పుడు వార్తలకు తాము ఆజ్యం పోయమని చెప్పారు. కానీ మర్చంట్ బ్యాంకర్ల సమాచారాన్ని కొట్టిపారేసే విధంగా లేకుండా.. వారు కూడా చాలా స్ట్రాంగ్ గా ఈ విషయాన్ని చెబుతున్నారు.  కంపెనీ మిగులు నిధులను రాబట్టుకునేందుకు అమ్మకాలకు సిద్దమవుతున్నట్లు పేర్కొంటున్నారు. దేశీ ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీగా వెలుగొందిన విప్రో మేనేజ్ మెంట్ వేరే వారి చేతుల్లోకి వెళ్లడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో విప్రో వృద్ధి రేటు సింగిల్ డిజిట్ కే పరిమితమైనా.. కంపెనీ మిగులు నిధులు మాత్రం రూ.34,474కోట్లు ఉన్నాయి.  
 
మరిన్ని వార్తలు