‘చిన్న’ బ్యాంకులకు సై!

17 Sep, 2015 01:25 IST|Sakshi
‘చిన్న’ బ్యాంకులకు సై!

చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయ అనుమతులు
లిస్టులో ఉజ్జీవన్, ఈక్విటాస్ తదితర 10 సంస్థలు
 
 ముంబై : సూక్ష్మ పరిశ్రమలు, సన్నకారు రైతులకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవల్ని అందించే లక్ష్యంతో చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి 10 సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ బుధవారం సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. ఈ జాబితాలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈక్విటాస్ హోల్డింగ్స్ మొదలైన సంస్థలు ఉన్నాయి. సూత్రప్రాయ అనుమతులు 18 నెలల పాటు వర్తిస్తాయని, ఈలోగా చిన్న ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్‌ఎఫ్‌సీ) ఏర్పాటుకు విధివిధానాలను ఆయా సంస్థలు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. అటుపైన వీటికి పూర్తి స్థాయి లెసైన్సులు లభిస్తాయి. మొత్తం 72 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.

డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఐఐఎఫ్‌ఎల్, ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్, యూఏఈ ఎక్స్చేంజ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మొదలైనవి కూడా పోటీపడ్డాయి. గత నెలలోనే 11 పేమెంట్ బ్యాంకులకు అనుమతించిన ఆర్‌బీఐ అంతక్రితమే రెండు కొత్త బ్యాంకులకూ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత లెసైన్సింగ్ రౌండు అనుభవాలను బట్టి తదుపరి లెసైన్సుల జారీ విధివిధానాల్లో తగు మార్పులు, చేర్పులు చేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది.

 విధివిధానాలివీ..
 కొత్తగా రాబోయే ఎస్‌ఎఫ్‌సీలు.. డిపాజిట్ల స్వీకరణ, బ్యాంకింగ్ పరిధిలో లేని చిన్న రైతులు.. లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు, అసంఘటిత రంగాలకు రుణాలివ్వడం తదితర ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. ఇవి దేశవ్యాప్తంగా ఎక్కడైనా కార్యకలాపాలు సాగించవచ్చు. వీటి లోన్ పోర్ట్‌ఫోలియోలో దాదాపు సగభాగం.. సుమారు రూ. 25 లక్షల దాకా ఇచ్చే రుణాలు ఉండాలి.  మిగతా వాణిజ్య బ్యాంకులకు వర్తించే నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో(ఎస్‌ఎల్‌ఆర్) తదితర నిబంధనలు అన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులకు వర్తించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితులు వీటికీ ఉంటాయి.

ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకుల్లో 74% ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. అత్యున్నత స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ప్రస్తుత విధివిధానాలకు తగు మార్పులు, చేర్పులు చేసి.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రైవేట్ రంగంలో మరిన్ని యూనివర్సల్ బ్యాంకు లెసైన్సుల జారీకి సంబంధించి విధానాలు ఆవిష్కరించగలమని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రాథమిక  దరఖాస్తులను ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఉషా తోరట్ సారథ్యంలోని ఎక్స్‌టర్నల్ అడ్వైజరి కమిటీ(ఈఏసీ).. పరిశీ లించి..  ఇంటర్నల్ స్క్రీనింగ్ కమిటీకి(ఐఎస్‌సీ) సిఫార్సు చేసింది. అటుపైన వ్యాపార ప్రతిపాదనలు, నిర్వహణ సామర్థ్యం తదితర అంశాల్లో ఐఎస్‌సీ కూడా వీటిని మదింపు చేసి ఆర్‌బీఐ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు(సీసీబీ)కి నివేదించింది. వాటికి అనుగుణంగా తాజా అనుమతులను ఆర్‌బీఐ ఇచ్చింది.
 
 
జాబితాలోని సంస్థలు..
ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బెంగళూరు)
ఈక్విటాస్ హోల్డింగ్స్
ఔ ఫైనాన్షియర్స్ (జైపూర్)
క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ (జలంధర్)
దిశ మైక్రోఫిన్  (అహ్మదాబాద్)
ఈఎస్‌ఏఎఫ్ మైక్రోఫైనాన్స్ (చెన్నై)
జనలక్ష్మి ఫైనాన్షియల్ (బెంగళూరు)
ఆర్‌జీవీఎన్ (నార్త్‌ఈస్ట్) మైక్రోఫైనాన్స్ (గువాహటి)
సూర్యోదయ్ మైక్రోఫైనాన్స్ (ముంబై)
ఉత్కర్ష్ మైక్రోఫైనాన్స్ (వారణాసి)

మరిన్ని వార్తలు