అమెరికాలో మళ్లీ కాల్పులు

2 Sep, 2019 04:30 IST|Sakshi
కాల్పులు జరిగిన ప్రాంతం

ఏడుగురు మృతి.. 20 మందికి గాయాలు

హ్యూస్టన్‌: అమెరికాలోని మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారన్న కోపంతో ఓ వ్యక్తి శనివారం మధ్యాహ్నం తన చుట్టూ ఉన్న వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటనలో ఏడుగురు మరణించగా మరో 20 మందికి గాయాలయ్యాయి. ఒడెస్సా.. మిడ్‌ల్యాండ్‌ ప్రాంతాల్లో జరిగిన ఈ సంఘటనలో కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్చివేశారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం తెలియరాలేదు.

కాల్పులకు తెగబడ్డ వ్యక్తికి సుమారు 30 ఏళ్ల వయసు ఉంటుందని.. కారులో వెళుతున్న అతడిని మధ్యాహ్నం 3 గంటలు (స్థానిక కాలమానం) సమయంలో రోడ్డు పక్కన నిలపాల్సిందిగా పోలీసు అధికారి కోరారని... దీంతో అతడు కాల్పులకు దిగాడని ఒడెస్సా పోలీస్‌ ఉన్నతాధికారి మైఖేల్‌ గెర్కే తెలిపారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన దుండగుడు పోస్టల్‌ విభాగానికి చెందిన కారును హైజాక్‌ చేయగా.. వెంటాడి కాల్చేసినట్లు ఆయన చెప్పారు.  అటార్నీ జనరల్‌ విలియం బార్‌ సంఘటన గురించి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వివరించినట్లు సమాచారం.

కాల్పుల సంఘటనపై విచారణకు ఎఫ్‌బీఐ, ఇతర ఏజెన్సీలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు విలియం బార్‌ ఒక ట్వీట్‌ ద్వారా తెలిపారు. టెక్సస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ ఈ సంఘటనను మతిలేని పిరికిపంద చర్యగా అభివర్ణించగా బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటన చేశారు. నెల రోజుల క్రితమే పశ్చిమ టెక్సస్‌ నగరాల్లో వారం వ్యవధిలో రెండు కాల్పుల సంఘటనలు చోటు చేసుకోవడం.. ఇందులో సుమారు 22 మంది మరణించడం ఇక్కడ ప్రస్తావనార్హం. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా