బ్యాంకు ఉద్యోగి మోసాల పర్వం

7 Mar, 2019 10:48 IST|Sakshi
నిందితురాలు సురేఖ(ఫైల్‌)

ఖాతాదారుల ఫిక్సిడ్‌ డిపాజిట్లు సొంతానికి డ్రా  

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు.. అరెస్టు

చైతన్యపురి: బ్యాంకు ఖాతాదారుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అక్రమంగా డ్రా చేసుకుని మోసానికి పాల్పడుతున్న కేసులో బ్యాంక్‌ మహిళా ఉద్యోగిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ బి.సాయిప్రకాష్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన కాశీభట్ల సురేఖ(35) దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసం ఉంటోంది. 2008 నుంచి కొత్తపేటలోని హెచ్‌డీఎఫ్‌సీ గడ్డి అన్నారం బ్రాంచిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా చేరింది. డబ్బు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే అధిక వడ్డీ వస్తుందని రిటైర్డ్‌ ఉద్యోగులకు చెప్పి బ్యాంక్‌లో ఖాతా ఓపెన్‌ చేయించి డబ్బు జమ చేసేది. డబ్బు జమ చేశాక ఫోన్‌ నంబర్‌ తమ బంధువులది ఇచ్చి కొన్ని రోజుల తరువాత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను లబ్ధిదారులకు తెలియకుండానే డ్రా చేసుకుని తన ఖాతాలో వేసుకునేది.

ఇలా 12 మంది డిపాజిట్లు సుమారు రూ.1.90 కోట్ల నగదును కాజేసింది. వాటిని ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టి నష్టపోయింది. 2012లో సురేఖపై ఇలాంటి ఫిర్యాదులు రావటంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించగా కొంత మందికి డబ్బులు తిరిగి ఇచ్చేసింది. అనంతరం ఎల్‌బీనగర్‌లోని ఇండస్‌ బ్యాంక్‌లో ఉద్యోగిగా చేరి అక్కడా ఇదే తరహా మోసాలకు పాల్పడటంతో ఉద్యోగం నుంచి తొలగించారు. న్యూ మారుతీనగర్‌కు చెందిన బాలచందర్‌ ప్రేమ చైతన్యపురి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో సురేఖ మోసాలు బయటపడ్డాయి. సురేఖతో ఉన్న పరిచయంతో తాము, తమ బంధువులు రూ.7 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశామని, కాలపరిమితి తర్వాత బ్యాంక్‌కు వెళ్లగా సురేఖ డబ్బులు డ్రా చేసుకున్నట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించామన్నారు. ముగ్గురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సురేఖను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితురాలు సురేఖపై సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రూ.5 లక్షల చీటింగ్‌కు సంబంధించి రెండు కేసులు, ఎల్‌బీనగర్‌ స్టేషన్‌లో రూ.10 లక్షల చీటింగ్‌పై మరో కేసు రికార్డయిందని ఎస్‌ఐ తెలిపారు. నిందితురాలిని కష్టడిలోకి తీసుకుని పూర్తి విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు