బార్‌ వ్యాపారులే సూత్రధారులు...!

22 Jun, 2020 12:59 IST|Sakshi

ఎక్సైజ్‌ సహకారంతోనే నడుస్తున్న రాకెట్‌?  

వ్యక్తిగత విభేదాలతోనే గుట్టురట్టు  

తెనాలి: తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో సూత్రధారులు మిస్సయ్యారు. కేవలం పాత్రధారులనే అరెస్టు చేయగలిగారని ఇక్కడి మద్యం వ్యాపార వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. పట్టణంలో ఇంతకు పూర్వం రెండు బార్‌ అండ్‌ రెస్టారెంట్లను నడిపిన వ్యాపారులే సిండికేట్‌గా మారి, అక్రమ వ్యాపారానికి తెరతీశారు. ఇందుకు స్థానిక ఎక్సైజ్‌ శాఖలోని ఓ అధికారి పరోక్ష సహకారం ఉందనే ఆరోపణలున్నాయి. సిండికేట్‌లోని ఒకరు, అధికారిక వ్యాపారంలోని ప్రత్యర్థితో రెండురోజుల క్రితమే  సున్నం పెట్టుకున్నాడు. ఇందుకు కక్ష గట్టిన ఆ వ్యాపారి సిండికేట్‌ కదలికలపై నిఘా వుంచి, అక్రమ మద్యం తరలింపుపై పక్కా సమాచారాన్ని చేరవేసినట్టు విశ్వసనీయ సమాచారం.

వెలుగులోకి రాని బడా వ్యాపారులు....
తెనాలి డివిజనులో రెండేళ్ల క్రితం అక్రమ మద్యంపై కేసుల నమోదు విషయం గుర్తుండే వుంటుంది. సొంతంగా తయారుచేసిన మద్యాన్ని బాటిల్స్‌లో నింపటం, ఖరీదైన లిక్కరు బాటిళ్లలో చౌకమద్యాన్ని/ నీటిని నింపి కొత్త మూతలతో సీలు వేసి, చేస్తున్న అమ్మకం గుట్టు బహిర్గతమైంది. పట్టణంలో వీటి వెనుకనున్న బడా వ్యాపారులు వెలుగులోకి రాలేదు. తాజాగా పట్టుబడిన కేసులోనూ ఈ తరహాలోనే అసలు సూత్రధారులు అండర్‌గ్రౌండ్‌లోనే ఉండిపోయారన్న చర్చ నడుస్తోంది. మద్యం తీసుకొస్తున్న వాహనాలకు ఎస్కార్ట్‌గా వస్తున్న కారును నిత్యం వాడుతుండే వ్యక్తి మద్యం వ్యాపారిగా పట్టణంలో అందరికీ చిరపరిచితుడు. స్వస్థలం సమీపంలోని అమృతలూరు మండలంలోని ఓ గ్రామం. అలాగే తెనాలికి దగ్గర్లోని మరో గ్రామానికి చెందిన వ్యాపారి, మరో ఇద్దరు ముగ్గురుతో కలసి పట్టణంలోని రెండు బార్‌ అండ్‌ రెస్టారెంట్లను నిర్వహిస్తూ వచ్చారు. లాక్‌డౌన్‌తో బార్లు మూతపడగా, తెలంగాణ నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్‌ మద్యంతో లాభాల వేటకు దిగారు. ఒక్కో క్వార్టరు బాటిల్‌ (180 ఎం.ఎల్‌)కు అదనంగా రూ.100 పైచిలుకు లాభానికి అమ్ముకునే మార్కెట్‌ వీరికి అభయమిచ్చింది.  

ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సమాచారం....
తమ సిండికేట్‌తో ఏమాత్రం సంబంధం లేని మరో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమానిని సిండికేట్‌లోని ఒకరు ఇటీవల ఫోను చేసి బెదిరించారు. అకారణంగా బెదిరించటంపై ఆగ్రహించిన ఆయన, స్థానిక టూ టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల హెచ్చరికతో ఆదివారం ఉదయం సారీ చెప్పారు. మరోసారి చేయనని లిఖితపూర్వకంగా రాసిచ్చి బయటపడ్డాడు. సిండికేట్‌ కార్యకలాపాలపై స్పష్టమైన అవగాహన ఉన్న  అదే యజమాని, సూర్యాపేట నుంచి వీరు మద్యం తరలిస్తున్న విషయాన్ని ఆదివారం తెల్లవారుజామున స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఫోర్స్‌కు సమాచారమిచ్చారు. ఎస్కార్ట్‌ వాహనం, సిండికేట్‌ పేర్లుతో సహా ఇచ్చిన పక్కా సమాచారంతో అక్రమ మద్యం తరలింపును అడ్డుకోగలిగారు. సిండికేట్‌లోని ప్రధాన వ్యాపారి నడిపే కారు, టి.శ్రీకాంత్‌ అనే పేరుతో ఉన్నందున అతడిని ఈ కేసులో సూత్రధారిగా అరెస్టు చేశారు. దీనితో సిండికేట్‌లోని ప్రధాన సూత్రధారి తప్పించుకున్నారని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు