బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

23 Sep, 2018 03:29 IST|Sakshi

బాసర: నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ (ఆర్జీయూకేటీ)లో శనివారం ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ భవనంపై నుంచి దూకిన ఆమె తీవ్రంగా గాయపడగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రేమ వ్యవహారమే కారణమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లికి చెందిన కొమురయ్య, పోసాని దంపతుల కూతురు అనూష(17) పీయూసీ రెండో ఏడాది చదువుతోంది. కళాశాలలోని వసతి భవనంలో మధ్యాహ్నం 12 ప్రాంతంలో హాస్టల్‌ భవనంపైకి ఎక్కి మూడో అంతస్తు పైనుంచి దూకింది.  

ఆమెను నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు అనూష రాసిన సూసైట్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంధువుల అబ్బాయితో ప్రేమ వ్యవహారం దెబ్బతిన్నట్లు, మనస్పర్ధల కారణంగా తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొందని తెలిపారు. చదువుల్లో ముందంజలో ఉండే అనూష ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కాగా, భైంసా డీఎస్పీ రాజేశ్‌ భల్లా ట్రిపుల్‌ ఐటీని సందర్శించి.. ఘటన వివరాలు తెలుసుకున్నారు.  

ఇటీవల మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం 
బాసర ఆర్జీయూకేటీలో వారం క్రితం ఓ విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ విషయం మీడియాకు తెలియకుండా కళాశాల యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా వాటిని నివారించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.  

మరిన్ని వార్తలు