బంధువులే చంపి.. అడవిపంది దాడిగా చిత్రీకరించారు!

18 Nov, 2019 08:58 IST|Sakshi
కమలప్ప (ఫైల్‌)

‘ఆస్తి కోసం హత్య చేశారు’

బంధువులే చంపేసి ప్రమాదంగా చిత్రీకరించారు

తండ్రి మరణంపై పోలీసులకు మృతుడి కుమారుడి ఫిర్యాదు

సాక్షి, బషీరాబాద్‌: అడవిపంది దాడిలో వ్యక్తి మృతిచెందిన కేసులో కొత్త మలుపు తిరిగింది. తన తండ్రిని బంధువులే చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బషీరాబాద్‌ మండలం మాసన్‌పల్లి గ్రామానికి రైతు గొల్ల కమలప్ప అడవి పంది దాడిలో ఈనెల 8వ తేదీన మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా మృతుడి కుమారుడు గొల్ల చరణ్‌ తన తండ్రిది ‘ముమ్మాటికి హత్యే’ అని ఆరోపించారు. ఆస్తి కోసం బంధువులే హత్యచేసి ప్రమాదకరంగా చిత్రీకరిస్తున్నారని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. గ్రామంలోని పొలాలతో పాటు తాండూరులో ఇంటి స్థలాలు తమకు ఉన్నాయని, వాటిని కాజేయడడానికి తన మేనమామ గొల్ల మొగులప్ప, మేనత్తలు గొల్ల కమలమ్మ, మొగులమ్మతో పాటు మరికొందరు కలిసి హత్యచేశారని ఆరోపించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని వారు బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరారు.  

విచారణకు ఆదేశించాం 
మాసన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు కమలప్ప మృతిపై మొదట ఫిర్యాదు చేయడానికి కుటుంబసభ్యులు వెనకాడారు. పోస్టుమార్టం కూడా వద్దన్నారు. ఆ తర్వాత ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు లోతుగా విచారణ చేపట్టాలని తాండూరు గ్రామీణ సీఐకి ఆదేశించాం. అన్ని కోణాల్లో విచారణ చేస్తాం. పోస్టుమార్టం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు ఆధారంగా కేసును త్వరగా చేధిస్తాం. 
– లక్ష్మీనారాయణ, డీఎస్పీ  

మరిన్ని వార్తలు