అన్న అప్పు చెల్లించలేదని చెల్లిపై అత్యాచారం 

6 Mar, 2019 08:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రెండేళ్లుగా వడ్డీ వ్యాపారి అఘాయిత్యం 

బనశంకరి : తీసుకున్న అప్పు చెల్లించలేదనే కారణంగా ఓ వడ్డీ వ్యాపారి అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లిపై రెండేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్న ఘటన మంగళవారం హుళిమావులో ఆలస్యంగా వెలుగు చూసింది. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన తారకనాథ్‌ చాలా ఏళ్ల క్రితం భార్యతో కలసి బెంగళూరు నగరానికి వచ్చి హుళిమావులో స్థిరపడ్డాడు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన తారకనాథ్‌ అందులో నష్టం వాటిల్లడంతో దివాళా తీశాడు. దీంతో అదే ప్రాంతానికి చెందిన బాలాజీ అనే వడ్డీ వ్యాపారి నుంచి రెండేళ్ల క్రితం రూ.6 లక్షల అప్పు తీసుకున్న తారకనాథ్‌ మరోసారి షేర్‌ మార్కెట్‌లో పెట్టాడు. రెండవసారి కూడా నష్టాలు రావడంతో అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో అప్పు చెల్లించాలంటూ బాలాజీ తరచూ తారకనాథ్‌ ఇంటికి వచ్చి బెదిరించేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న తారకనాథ్‌ చెల్లెలు ఉద్యోగం కోసం బెంగళూరు నగరానికి వచ్చి అన్న తారకనాథ్‌ ఇంట్లోనే ఉంటున్నారు. అప్పు చెల్లించాలంటూ తరచూ ఇంటికి వస్తున్న బాలాజీ తారకనాథ్‌ చెల్లిలిని చూసి ఆమెను లొంగదీసుకోవడానికి కుట్ర పన్నాడు. ఈ క్రమంలో ప్రతీరోజూ తారకనాథ్‌ ఇంటికి రావడం మొదలుపెట్టిన బాలాజీ అప్పు చెల్లించాలంటూ తారకనాథ్‌ చెల్లిలిని లైంగికంగా వేధించసాగాడు. 

బెదిరిస్తూ పలుమార్లు అకృత్యాలకు పాల్పడ్డాడు. బాధితురాలు రెండేళ్లుగా మౌనంగా భరిస్తూ వచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న బాలాజీ మరింత రెచ్చిపోయాడు. కొద్ది రోజుల క్రితం తారకనాథ్‌ను అపహరించిన బాలాజీ తారకనాథ్‌పై ఇష్టారీతిన దాడి చేసి అప్పు చెల్లించకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు ఇటీవలే తాను ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగంలో చేరానని కొద్దిగా సమయం ఇస్తే అప్పు వడ్డీతో సహా చెల్లిస్తానంటూ విన్నవించింది. అందుకు బాలాజీ నిరాకరించడంతో హుళిమావు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు తనపై జరుగుతున్న అత్యాచారం గురించి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు వడ్డీ వ్యాపారి బాలాజీకి నగదు రూపంలో, ఆన్‌లైన్‌లో రూ.30 లక్షలు బదిలీ చేసానని దీంతోపాటు బాలాజీ తన నుంచి రూ.13 లక్షల విలువ చేసే ఆభరణాలు కూడా లాక్కున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలాజీని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.   

మరిన్ని వార్తలు