రూ.22 వేలు కడితే.. వారానికి రూ.9 వేలు

23 Oct, 2019 10:35 IST|Sakshi
బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న తాలూకా జూనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్లు 

సేవ్‌ షాప్‌ పేరుతో ఘరానా మోసం

ఒకసారి చెల్లిస్తే మూడు తరాల వరకు డబ్బులంటూ అమాయక ప్రజలకు వల 

ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.11 వేలు, రూ20 వేలు వసూలు

రూ.3 వేలు విలువ చేసే వస్తువులు అంటగట్టిన వైనం 

ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తాలుకా సీఐ లక్ష్మణ్‌

ఒక్కసారి చెల్లించండి..మూడు తరాల వరకు మీ కుటుంబానికి పెన్షన్‌ అందుతూనే ఉంటుంది. రూ.11 వేలు చెల్లిస్తే వారానికి రూ.4,500 పెన్షన్, రూ.20 వేలు చెల్లిస్తే వారానికి రూ.9 వేల పెన్షన్‌ చెల్లిస్తాం.. అంటూ అమాయక ప్రజలను నిలువునా మోసం చేశారు. ఇలాంటి కంపెనీలు గతంలో ఎన్నిసార్లు బోర్డు తిప్పేస్తున్నా ప్రజలు మాత్రం గుడ్డిగా నమ్ముతూ వేలకు వేలు చెల్లిస్తూ మోసపోతూనే ఉన్నారు. జిల్లాలో తాజాగా సేవ్‌షాప్‌ పేరుతో ప్రజలను ఘరానా మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తుండటంతో తాలుకా పోలీస్‌స్టేషన్‌లో జూనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్లను ఏర్పాటుచేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. 

సాక్షి, ఒంగోలు: రెక్కాడితే గానీ డొక్కాడని అమాయక ప్రజలను మభ్యపెట్టి, మాయమాటలతో వేలకు వేలు కట్టించుకొని ఘారానా మోసం చేసిన ఘటన ఒంగోలులో వెలుగుచూసింది. దీంతో బాధితులంతా ఒక్కొక్కరు ఫిర్యాదు చేసేందుకు 50 మంది వరకు తాలుకా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.  
ఆశ చూపి...
2019 సాధారణ ఎన్నికలకు ముందు ఇద్దరు మహిళలు జయప్రకాష్‌ కాలనీ వద్దకు వచ్చారు.  వారు గతంలో జయప్రకాష్‌ కాలనీలో నివాసం ఉండేవారు. ప్రస్తుతం కొప్పోలు సమీపంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. వారిపేర్లు సౌందర్య, ఝాన్సీ. వీరిదరూ సేవ్‌ షాప్‌ అనే సంస్థలో చేరితే చాలా డబ్బులు వస్తాయంటూ ఆశచూపారు. ఇందుకు ఎన్నో లెక్కలు చెప్పి అక్కడి వారిని  నమ్మించారు. దీంతో ఒకరికి ఒకరు తోడుగా పోటీ పడి మరీ డబ్బులు కట్టారు. ఈ నేపథ్యంలో మరింత మంది సభ్యులను చేర్పించేందుకు గురూజీ అంటూ ఓ వ్యక్తిని తీసుకువచ్చారు. ఆయన రంగారాయుడు చెరువు వద్ద ఉన్న ఫంక్షన్‌ హాలులో కార్యక్రమం ఏర్పాటు చేసి ఏవేవో లెక్కలు చెప్పి నమ్మించి మీకు తెలిసిన వారిని పరిచయం చేయండంటూ సూచించాడు. కార్యక్రమం జరిగే సమయంలో ఎవ్వరూ ఫొటోలు తీయరాదంటూ ఆంక్షలు విధించాడు. అయితే సదరు గురూజీ ఎక్కడ ఉంటాడో, ఎక్కడ నుంచి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు.  

మోసం చేసింది ఇలా..
సేవ్‌ షాప్‌లో చేరిన వారికి వరాల జల్లు కురిపించారు. ఈ పథకంలో  రూ.11 వేలు, రూ.20,200 చెల్లించి సభ్యులుగా చేరాల్సి ఉంటుంది. సభ్యులుగా చేరిన వారికి రెండు జతల దుస్తులు, డిన్నర్‌ సెట్లు, కొంత డబ్బు డ్రా చేసుకునేందుకు వీలుగా ఒక చెక్కు పంపుతారు. ఆ చెక్కు రూపాయల్లో ఉండవచ్చు, లేదా వేలల్లో ఉండవచ్చు. రూ.11 వేలు చెల్లించిన వారికి వారానికి రూ.4,500, రూ.20,200 చెల్లించిన వారికి రూ.9 వేలు చొప్పున పెన్షన్‌ చెల్లిస్తామని నమ్మించారు. ఇలా ఎన్నాళ్లు ఇస్తారనుకుంటున్నారా...కట్టిన వారికే కాదు...వారి మూడు తరాల వరకు వరకు ఈ పెన్షన్‌ ఇస్తూనే ఉంటామని నమ్మబలికారు. మూడు తరాల వరకు పెన్షన్‌ ఎలా ఇస్తారని ఏమాత్రం ఆలోచించని జనం వాళ్లకు గుడ్డిగా నమ్మి నగదు చెల్లించారు.

వీరిలో ధర్నాసి వెంకట్రావు అనే వ్యక్తి రూ.20,200 చెల్లిస్తే రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు. నల్లబోతుల చంద్రమ్మ అనే మహిళకు ఒక డిన్నర్‌సెట్, రూ.66 చెక్కులు ఇచ్చారు. ఇలా రాచపూడి కోటమ్మ, ఏసమ్మ, నలబోతుల వెంకటేశ్వరుల, రాచపూడి నిమ్మేష్, ధర్మయ్య, ఒకీలమ్మ, ఇస్తర్ల నిరీక్షణ, ఆలంపూడి గంగమ్మ, బండి జయమ్మలు రూ.11 వేలు, రూ.20 వేల చొప్పున చెల్లించారు. వీరికి ఇచ్చిన చెక్కుల కవర్లపై సేవ్‌ అండ్‌ సెక్యూర్‌ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అని ఉంది.  ప్రస్తుతం బాధితుల నుంచి తాలుకా పోలీసులు వివరాలు నమోదు చేసుకునే పనిలో పడ్డారు. 

కట్టేంతవరకు పోరు పెట్టారు: 
నా భర్త, ఇద్దరు పిల్లలు మరణించారు. ఎన్నికలకు ముందు వచ్చి డబ్బులు కట్టు, నీవు జీవితాంతం సుఖపడతావని నమ్మించారు. వారు కట్టారు..వీళ్లు కట్టారు వారానికి రూ.9 వేలు ప్షెన్‌ అన్నారు. రూ.20,200 కడితే 2 జతల దుస్తులు, డిన్నర్‌ సెట్‌ ఇచ్చారు. ఆ తర్వాత వారిని అడుగుతుంటే వస్తాయని చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు మా కాలనీ వైపు కూడా రావడం లేదు. 
ఏసమ్మ, చైతన్య కాలనీ

అప్పు తెచ్చి మరీ నలుగురిని చేర్పించా: 
డబ్బులు కట్టించుకునేటపుడు మరో ముగ్గురిని కట్టించాలన్నారు. దీంతో మా కాలనీవారైన రాచపూడి నిమ్మేష్, ధర్మయ్యలను రూ.11వేలు చొప్పున , ఒకీలమ్మ, ఇస్తర్ల నిరీక్షణలను రూ.20,200ల చొప్పున కట్టించా. వీరికి డబ్బులు చాల్లేదంటే రూ.30 వేలు అప్పు తెచ్చి వీరికి అడ్డం పెట్టా. ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. 
రాచపూడి కోటమ్మ, జయప్రకాష్‌ కాలనీ

నాతో పాటు మా అమ్మ కూడా కట్టింది: 
చెక్క రిక్షా తొక్కుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఆటోలు పెరిగిపోతుండడంతో చెక్క రిక్షా బాడుగలు ఉండడం లేదు. దీంతో అందరు కడుతున్నామంటే నేను కూడా కట్టా. నేను కట్టానని మా అమ్మ చంద్రమ్మ కూడా కట్టింది. నాకు డిన్నర్‌ సెట్‌తో పాటు వెయ్యి రూపాయల చెక్కు వచ్చింది. మా అమ్మకు డిన్నర్‌సెట్, రూ.66 చెక్కు వచ్చింది. 
నలబోతుల వెంకటేశ్వర్లు, జయప్రకాష్‌ కాలనీ 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా