పాపం పసికందు

20 Sep, 2019 11:19 IST|Sakshi
³ పసికందు మృతదేహాన్ని పరిశీలిస్తున్న కేసలి అప్పారావు, తదితరులు

తలభాగాన్ని పీక్కుతినేసిన కుక్కలు 

జొన్నగుడ్డి ఉప్పరవీధిలో వెలుగుచూసిన దారుణం 

మృతశిశువును కేంద్రాస్పత్రికి తరలింపు 

సాక్షి, విజయనగరం క్రైం: వ్యర్థాలు, చెత్తకుప్పలతో నిండిపోయి, వర్షానికి విపరీతమైన దుర్వాసన వచ్చే జొన్నగుడ్డి ఉప్పరవీధి శివారున నెలలు నిండని పసికందు మృతదేహం గురువారం బయటపడింది. సుమారు మూడున్నర నెలల వయస్సు ఉన్న ఈ పసికందు మృతదేహాన్ని ఎప్పుడు పడేశారో తెలియదు. తలభాగం పూర్తిగా పందులు, కుక్కలు పీకేశాయి. కొందరు మహిళలు ఉదయాన్నే అటుగా వచ్చినప్పుడు వారికి ఈ దృశ్యం కనిపించింది. వారు కేకలు వేయడంతో స్థానికులు, చుట్టు పక్కల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయ్యో ‘పాప’ం అంటూ నిట్టూర్చారు. పిల్లలు లేని దం పతులు ఎందరో ఉన్నారని, వారికి శిశువును అప్పగిస్తే సరిపోయేదంటూ వాపోయారు.

పోలీ సులకు సమాచారం అందించారు. వన్‌టౌన్‌ పోలీసులు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ రాష్ట్ర నాయకుడు కేసలి అప్పారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతశిశువును పరిశీలించారు. అనంతరం అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఊయల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా బిడ్డలు వద్దనుకుంటే ఆ ఊయలలో వదిలేసి వెళ్లిపోవచ్చని, ప్రతీ ప్రభుత్వాస్పత్రిలో ఒక ఊయల ఉంటుందన్నారు. లేదంటే చైల్డ్‌లైన్‌కి అప్పగించవచ్చని తెలిపారు. ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల పసికందులు మృత్యువాతకు గురవుతారన్నారు. ఇటువంటి దారుణాలకు పాల్పడవద్దని కోరారు.  వన్‌టౌన్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ నేతృత్వంలో మృతశిశువును కేంద్రాస్పత్రికి తరలించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా