ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లి..

10 Jul, 2019 20:59 IST|Sakshi
కోమల్ తలాన్‌‌

న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకుందని భావించిన మహిళ ఊహించని విధంగా ప్రత్యక్షమైన ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్‌ కంపెనీలో ట్రైని మేనేజర్‌గా పనిచేస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ కార్యదర్శి కుమార్తె అనిల్‌ తలాన్‌ కోమల్‌(29) ఈనెల 5న ఢిల్లీ నుంచి అదృశ్యమయ్యారు. ఆమె కారును ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న హిండన్‌ బ్రిడ్జి వద్ద కనుగొన్నారు. కారులో సూసైడ్‌ నోట్‌ ఉండటంతో హిండన్‌ కాలువలోకి దూకి ఆమె ఆత్మహత్య చేసుకునివుండొచ్చని భావించారు. తన భర్త అభిషేక్‌‌, మెట్టినింటి వారి వేధింపులు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సూసైడ్‌ నోట్‌ పేర్కొన్నారు. కోమల్‌ను అత్తింటివారు వేధింపులకు గురిచేసిన మాట వాస్తమేనని ఆమె తండ్రి అనిల్‌ తలాన్‌ కూడా పోలీసులతో చెప్పారు. మూడు రోజుల పాటు హిండన్‌ నదిలో గాలింపు జరిపినా మృతదేహం దొరక్కపోవడంతో పోలీసులు మరో కోణంలో విచారణ చేపట్టారు.

నిఘా సమాచారంతో మలుపు
అయితే కోమల్‌ బతికేవుందని ఇంటెలిజెన్స్‌ విభాగం కనిపెట్టడంతో పోలీసులతో సహా ఆమె కుటుంబీకులు అవాక్కయ్యారు. రాజస్తాన్‌ జైపూర్‌లోని కొంత మందిని ఆమె కాంటాక్ట్‌ అయినట్టు నిఘా విభాగం సమాచారం ఆధారంగా గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి విచారించారు. మహారాష్ట్రలోని ముంబైకి వెళ్లినట్టు సమాచారం దొరికింది. దీంతో పోలీసులు ముంబైకి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. చివరకు ఆమె బెంగళూరులో ఉన్నట్టు గుర్తించారు. ఘజియాబాద్‌ పోలీసులు ఆమెను తీసుకొచ్చి విచారణ చేపట్టారు. ‘నా భర్తను అరెస్ట్‌ చేశారా, అతడిని జైలుకు పంపారా?’ పోలీసులను చూసిన వెంటనే ఆమె అడిగిన మొదటి ప్రశ్న ఇది. తనను వేధింపులకు గురిచేసిన భర్తను జైలుకు పంపాలన్న ఉద్దేశంతో కోమల్‌ ఇదంతా చేశారని ఘజియాబాద్‌ నగర ఎస్పీ శ్లోక్‌ కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు