లారీలు ఢీకొట్టుకొని..

6 Jul, 2019 10:24 IST|Sakshi

సాక్షి, వినుకొండ(గుంటూరు) : వినుకొండ రూరల్‌ మండలం శివాపురం వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, రెండో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సంగం డెయిరీ నుంచి మార్కాపురం వెళ్తున్న పాల లారీ, కర్నూలు వైపు నుంచి కట్టెల లోడుతో వస్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు సంతగుడిపాడుకు చెందిన గూడా కొండారెడ్డి (38) ప్రాణాలు కోల్పోగా, తమిళనాడుకు చెందిన డ్రైవరు పాండీ తీవ్ర గాయాలవడంతో ప్రకాశం జిల్లా వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది బాధితుల్ని రక్షించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు..
నాదెండ్ల: రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు–కర్నూలు రాష్ట్రీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ డి. చెన్నకేశవులు తెలిపిన వివరాల మేరకు.. సాతులూరు గ్రామానికి చెందిన వీరవల్లి గోపి (24) చందవరం రోడ్డులోని బీసీ కాలనీలో నివాసం ఉంటాడు. దగ్గర్లోని రైస్‌ మిల్లులో గుమస్తాగా పని చేస్తుంటాడు. గురువారం రాత్రి విధుల్లోకి వెళ్లి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికి వచ్చే క్రమంలో రహదారిని దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడిఉన్న గోపీని ఎవరూ గమనించలేదు. ఆరు గంటల సమయంలో స్థానికులు గమనించి 108 సాయంతో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో  గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. మృతుడికి భార్య, తల్లి ఉన్నారు. ఎస్‌ఐ చెన్నకేశవులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు