మాస్టారు.. ఇదేం పద్ధతి?  

30 Jun, 2018 10:48 IST|Sakshi
 విక్రమపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్న గ్రామస్తులు  

మద్యం తాగి పాఠశాలకు వస్తారా?

ఉపాధ్యాయుడిని నిలదీసిన విక్రమపురం గ్రామస్తులు

తమ పిల్లలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నాడని ఆగ్రహం

టీచర్‌ను వెంటనే తొలగించాలని ఆందోళన

వీరఘట్టం : విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో జోగుతుండడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ ఉపాధ్యాయుడిని పాఠశాల నుంచి పంపించేయాలని, లేని పక్షంలో పిల్లల టీసీలు ఇచ్చేయాలని స్పష్టంచేశారు. విక్రమపురం ప్రాథమిక పాఠశాల వద్ద సర్పంచ్‌ మాచర్ల వెంకటరమణ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు.

విక్రమపురం పాఠశాలలో ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు నిత్యం మద్యం తాగి పాఠశాలకు రావడం.. పనివేళలో తరగతి గదిలోనే నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. ఈ విషయాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించారు. ఈ మేరకు ఈ ఉపాధ్యాయుడిపై ఆరు నెలల నుంచి జన్మభూమి–మా ఊరు గ్రామసభలో, మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో, పలుమార్లు గ్రీవెన్స్‌లో గ్రామస్తులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.

అయినా ఉన్నతస్థాయి అధికారులు పట్టించుకోవడంతో ఉపాధ్యాయుడు నిత్యం పాఠశాల వద్దే మద్యం తాగడం ప్రారంభించాడు. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. 

తగ్గిన విద్యార్థుల సంఖ్య

ఉపాధ్యాయుల ప్రవర్తనా నియమావళి బాగా లేకపోవడంతో ఈ ఏడాది ఒక్క కొత్త అడ్మిషన్‌ కూడా జరగలేదు. రెండేళ్ల క్రితం 80 మంది విద్యార్థులతో 8 మంది సిబ్బందితో ప్రాథమికోన్నత పాఠశాలగా ఉండే విక్రమపురం పాఠశాల నేడు అధ్వానంగా మారింది. విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గడంతో ప్రాథమిక పాఠశాలగా మారింది.

ప్రస్తుతం పాఠశాలలో ఉన్న 37 మందికి కేవలం 11 మంది మాత్రమే పాఠశాలకు వస్తున్నారు. మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించేశారు. ఇంకా వీరికి టీసీలు మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న 11 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పేదలు కావడంతో ప్రైవేటు పాఠశాలలకు పంపించడం లేదు.

గతం ఘనం.. 

వీరఘట్టం మండలంలో విక్రమపురం పాఠశాలకు ఘన చరిత్ర ఉంది. ఈ పాఠశాలలో చదువుకున్న 80 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. నిత్యం పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల తీరు బాగోలేకపోవడంతో వీరు కూడా ఇటు చూడడం మానేశారు. తక్షణమే ఈ ఉపాధ్యాయులను బదిలీ చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మారడం లేదు

మందు తాగి పాఠశాలకు రావొద్దని ఎన్నో సార్లు చెప్పాం. అయినా ఆ ఉపాధ్యాయుడి పద్ధతి మారలేదు. అంతేకాక పిల్లలతో కాళ్లు పట్టించుకోవడం, మందు కోసం గ్లాసులు తెప్పించుకోవడం చేస్తున్నాడు. పాఠాలు చెబుతారని పంపిస్తే పిల్లలతో ఇలాంటివి చేయిస్తున్నాడు. తక్షణమే ఈ ఉపాధ్యాయుడిని బదిలీ చేయాలి.

– ఎన్‌.మరియమ్మ, విద్యార్థి తల్లి, విక్రమపురం  

ప్రైవేటు బడికి పంపే స్తోమత లేదు

ఉపాధ్యాయుల పద్ధతి బాగోలేకపోవడంతో స్తోమత ఉన్నవారు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారు. మాకు స్తోమత లేదు. ఇక్కడే చదివించగలం. అటువంటప్పుడు మద్యం తాగి పాఠశాలకు రావడం పద్ధతి కాదు. అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాలి.

– బి.నారాయణరావు, విద్యార్థి తండ్రి, విక్రమపురం  

>
మరిన్ని వార్తలు