రైతు కూతురు వేరే కులం వ్యక్తితో సంబంధం పెట్టుకుందని..

23 Aug, 2019 14:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పాట్నా : కూతురు తక్కువ కులం వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ కుల పెద్దలు ఓ రైతును చిత్రహింసలు పెట్టారు. కూతురిపై నిందలు వేయటమే కాకుండా పంచాయితీ పెట్టి ఊరి జనం ముందు పరువుతీశారన్న బాధతో ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బిహార్‌ పలము జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పలము జిల్లాకు చెందిన ఓ రైతు మైనర్‌ కూతురు తక్కువ కులం వ్యక్తితో సంబంధం పెట్టుకుని కులం పరువు తీసిందని ఆరోపిస్తూ ప్రజాపతి పెద్దలు గత ఆదివారం పంచాయితీ నిర్వహించారు. తన కూతురు అలాంటిది కాదని రైతు వాదించగా విచక్షణా రహితంగా అతడిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా రూ. 41వేలు చెల్లించాలని, వారణాసి, గయ వంటి పవిత్ర హిందూ ప్రదేశాలలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించాలని ఆదేశించారు.

కుల పెద్దల తీరుతో భయపడిపోయిన రైతు డబ్బు చెల్లించటానికి ఒప్పుకున్నాడు. కానీ, తన ఆర్థికస్థోమతను దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని తగ్గించాలని ప్రాధేయపడ్డాడు. రైతు తీవ్రంగా బ్రతిమాలిన తర్వాత రూ. 11వేలకు తగ్గించారు. ఇందుకు ప్రతిగా గుంజీలు తీయించారు. సదరు రైతు రుసుము చెల్లించేందుకు అక్కడే ఉన్న తన బంధువు దగ్గరినుంచి ఓ ఏడు వేలరూపాయలు అప్పుగా తీసుకుని వారికి చెల్లించాడు. మళ్లీ గుంజీలు తీసిన అనంతరం కుటుంబసభ్యులు పిలుస్తున్నా వినకుండా అతడు అడవి వైపుగా వెళ్లిపోయాడు. పంచాయితీలో తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయిన రైతు! రెండు రోజుల తర్వాత ఉరివేసుకుని కనిపించాడు. అతడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు