నిర్లక్ష్యానికి మత్స్యకారుల బలి

25 Jul, 2018 07:28 IST|Sakshi
చికిత్స పొందుతున్న రొక్కాల శ్రీనివాసరావుని పరామర్శిస్తున్న డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ దేవకుమార్‌

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు మృతి

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

కాయ కష్టం చేసుకుని జీవించే వారి కుటుంబాల్లో విషాదం అలముకుంది. జీవనోపాధి కోసం రొయ్యల వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులను విద్యుత్‌ బలి తీసుకుంది. రొయ్య చెరువుల వద్ద ఆక్వా రైతుల నిర్లక్ష్యంతో కూలి పని చేసుకునే నిరుపేదలు, వేటకు వెళ్లిన మత్స్యకారులు మృత్యుపాశాలకు బలైపోయారు.

అల్లవరం (అమలాపురం): అల్లవరం మండలం మొగళ్లమూరులో మంగళవారం ఉదయం విద్యుదాఘాతానికి మత్స్యకారులు ఓలేటి సత్తిబా బు (33), మల్లాడి ఏసుబాబు (22) మృతి చెందారు. మరో ముగ్గురు బర్రే రాంబాబు, ఓలేటి సత్యనారాయణ, కాపాలాదారుడు రొక్కాల శ్రీనివాసరావు షాక్‌కు గురై ప్రమాదం నుంచి బయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు, మత్స్యకారులు తెలిపి న వివరాల ప్రకారం.. మొగళ్లమూరు సర్పంచ్‌ భర్త అల్లూరి గోపాలకృష్ణంరాజుకి చెందిన చెరువులో రొయ్యల వేటకు రెబ్బనపల్లి గ్రామానికి చెందిన 15 మంది మత్స్యకారులు కూలి పనికి వెళ్లారు. రొయ్యలు వేటాడటానికి వెళ్లిన మత్స్యకారులు వేటకు సిద్ధపడుతుండగా సరిహద్దు రైతు వీరవరం అంజిబాబు మత్స్యకారులను పిలిచి అడ్డుగా ఉన్న జనరేటర్‌ను పక్కకు తప్పించాలన్నారు.

అయితే అందుకు మత్స్యకారులు ఒప్పుకోలేదు, రొయ్యల వేటకు వచ్చిన మేము ఈ తరహా పనులు చేయమని తేల్చి చెప్పారు. అయితే అప్పుడే అక్కడకి వచ్చిన జట్టు మేస్త్రీ  ఓలేటి సత్తిబాబు జనరేటర్‌ను లాగేందుకు 15 మంది మత్స్యకారులను ఒప్పించాడు. జనరేటర్‌కు ముందు భాగంలో ఇనుప యాంగులర్‌ని ఐదుగురు, జనరేటర్‌కు వెనుక భాగంలో మరో 10 మంది మత్స్యకారులు కర్రలు సహాయంతో జనరేటర్‌ను లాగుతున్నారు. జనరేటర్‌ను లాగుతున్న క్రమంలో పై భాగంలో ఉన్న విద్యుత్‌ వైర్లు జనరేటర్‌ పై టాప్‌కి తగిలి వైర్లు తెగి పడి జనరేటర్‌కు విద్యుత్‌ సర్క్యూట్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో ముందు భాగంలో ఇనుప యాంగులర్‌ లాగుతున్న ఐదుగురు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. వెనుక భాగంలో ఉన్న మత్స్యకారుల చేతిలో కర్రలు ఉండడంతో విద్యుత్‌ షాక్‌ నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.

ఆలస్యమైన చికిత్స
విద్యుత్‌ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమలాపురం ఆస్పత్రికి తరలించడానికి తోటి కూలీలు ఆటోల కోసం ప్రయత్నించినా ఎవరూ స్పందించ లేదు. దీంతో చికిత్స ఆలస్యమైంది. ఈ దశలో అప్పటికే అక్కడి చేరుకున్న అల్లవరం ఎస్సై డి.ప్రశాంత్‌కుమార్‌ తన జీపులో విద్యుత్‌ షాక్‌కు గురైన ఇద్దరు మత్స్యకారులను, అంబులెన్స్‌లో ముగ్గురు మత్స్యకారులను తరలించారు. అయితే మార్గం మధ్యలో ఓలేటి సత్తిబాబు, మల్లాడి ఏసుబాబు మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న బర్రే రాంబాబు, రొక్కాల శ్రీనివాసరావులకు వీఎన్‌ నర్సింగ్‌ హోమ్‌లో, ఓలేటి సత్యనారాయణకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలు, వాహనాలు అందుబాటులో లేకపోవడంతో చికిత్స అందక ఇద్దరు మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్, హోం మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే ఆనందరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ దేవకుమార్‌ పరామర్శించారు. మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని వైద్యులకు సూచించారు.

మరిన్ని వార్తలు