పట్టుబడిన నరహంతక పులి

2 Feb, 2019 12:04 IST|Sakshi

ఫలించిన ఆపరేషన్‌

ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు

కర్ణాటక, మైసూరు : ముగ్గురు వ్యక్తులను బలి తీసుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పెద్దపులిని శుక్రవారం అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. జిల్లాలోని హెచ్‌డీ కోటె తాలూకా నాగరహొళె జాతీయ ఉద్యానవనంలో వేటాడడానికి సాధ్యపడకపోవడంతో ఎనిమిదేళ్ల వయసున్న ఓ పెద్దపులి కొద్ది రోజులుగా ఆహారం కోసం తాలూకాలోని డీబీ కుప్ప గ్రాపం పరిధిలో గ్రామాల్లోకి చొరబడి పశువులను చంపి తింటోంది. కాగా కొద్ది కాలం క్రితం ఒక గ్రామస్థుడిని చంపిన పులి అప్పటి నుంచి మనుషుల రక్తానికి అలవాటు పడింది. దీంతో తరచూ గ్రామాల్లో చొరబడి పొలాల్లో ఒంటరిగా ఉండే మనుషులను వేటాడడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో రోజుల వ్యవధిలో గ్రామాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులను పెద్దపులి చంపింది. దీనిపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో మేల్కొన్న అధికారులు పులిని బంధించాలని సాధ్యం కాకపోతే చంపేయాలంటూ సిబ్బందికి ఆదేశించారు. దీంతో శుక్రవారం పెద్దపులిని పట్టుకోవడానికి కార్యాచరణ ప్రారంభించిన అటవీశాఖ అధికారులు,సిబ్బంది దసరా ఏనుగులు అర్జున, అభిమన్యు, కృష్ణ,గోపాలస్వామి, భీమ ఏనుగుల సహాయంతో బెంగళూరు నుంచి షార్ప్‌ షూటర్స్‌ను రప్పించి పెద్దపులి కోసం వేట సాగించారు. ఈ క్రమంలో నాగరహొళె జాతీయ ఉద్యానవనం బళ్లె పరిధిలోని మచ్చూరు సమీపంలోని హుసూరులో వేట కొనసాగిస్తున్న అధికారులకు పెద్దపులి కంటబడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటర్స్‌ మత్తు మందును పులికి ఇంజెక్ట్‌ చేయడంతో పులి స్పృహ కోల్పోగా వెంటనే పులిని మైసూరు జంతుప్రదర్శనశాలకు తరలించారు.పెద్దపులి ఎట్టకేలకు చిక్కడంతో గ్రామస్థులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు