గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరుడి అరెస్ట్‌

5 Jul, 2019 07:17 IST|Sakshi

సాక్షి, భువనగిరి: గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరుడు కత్తుల జంగయ్యను అరెస్ట్‌ చేసినట్లు సీఐ సురేందర్‌ తెలిపారు. గురువారం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి వివరాలు వెల్లడించారు.  హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన డీఎస్‌ ప్రాన్సిస్‌ తన ముగ్గురు స్నేహితులతో కలిసి భువనగిరి పట్టణ శివారులో ఉన్న ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ వెంచర్‌లో 1993, 1996 మధ్యలో జీపీఏ హోల్డర్‌ పక్కిర్‌ బాల్‌రెడ్డి వద్ద  నాలుగు ప్లాట్లను ఒక్కొక్కటి 300 గజాల చొప్పున మొత్తం 1200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు.

2006 సంవత్సరంలో నయీం తన అనుచరులైన పాశం శ్రీను, నాజర్, కత్తుల జంగయ్యతో కలిసి ఎలాగైనా మొత్తం భూమిని కాజేయాలనే ఉద్దేశంతో దౌర్జన్యం చేసి సర్వే నంబర్‌ 721, 733లో ఉన్న మొత్తం 154 ఎకరాల భూమిని పక్కిరు బాల్‌రెడ్డికి జీపీఏ చేసిన వ్యక్తుల ద్వారా రిజిస్టర్‌ చేసుకుని తమ కబ్జాలోకి తీసుకున్నారు. బాధితులు ప్లాట్లలోకి వెళ్లినపుడు ఇక్కడికి వస్తే చంపేస్తాం అంటూ బెదిరించారు. తమ ప్లాట్లను అన్యాయంగా అక్రమించుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా పట్టణంలోని స్థానిక సంజీవనగర్‌లో కత్తుల జంగయ్య ఉన్నట్లు సమాచారం రావడంతో అతని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతనిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో కేసునమోదు చేసి కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. గతంలో కత్తుల జంగయ్యను మొత్తం 91కేసులలో అరెస్టు చేసినట్లు, పీడీ యాక్టును కూడా నమోదు చేయగా సంవత్సరం జైలు శిక్ష పడినట్లు తెలిపారు.      

మరిన్ని వార్తలు