పోలీసుల అదుపులో ఏడో నిందితుడు..

19 May, 2018 10:46 IST|Sakshi
నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న ఏఎస్పీ దీపిక పాటిల్‌

నవ వరుడు గౌరీ శంకర్‌  హత్యకేసులో మరొకరి అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన ఏఎస్పీ దీపికాపాటిల్‌

పార్వతీపురం : గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద ఉన్న ఐటీడీఏ పార్క్‌ సమీపంలో ఈ నెల 7న జరిగిన నవ వరుడు గౌరీశంకరరావు హత్యకేసు కొత్త మలుపు తిరిగింది. కట్టుకున్న భర్త గౌరీశంకరరావును (మేనమామ) కడతేర్చాలని తన ప్రియుడు శివ సహకారంతో విశాఖపట్నానికి చెందిన రౌడీమూకతో ఒప్పందం కుదుర్చుకున్న భార్య పథకం ప్రకారం భర్తను చంపించిన విషయం తెలిసిందే.

అయితే ఈ హత్యకేసుకు సంబంధించి ఏఎస్పీ దీపిక పాటిల్‌ విచారణలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. పెళ్లి అయిన తర్వాత చంపించడానికి పథకం పన్నడమే కాకుండా పెళ్లికి ముందు కూడా బెంగళూరులో పనిచేస్తున్న సమయంలో  గౌరీశంకరరావును హత్య చేయించేందుకు సరస్వతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తెలిసింది.

ఈ వివరాలను  ఏఎస్పీ దీపిక పాటిల్‌ శుక్రవారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే సరస్వతి విశాఖపట్నంలోని సాయిసుధ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నప్పుడు కల్యాణి అనే స్నేహితురాలు పరిచయమైంది. ఆమె సహకారంతో రాజాన శ్రీనివాసరావు అనే వ్యక్తిని పరిచయం చేసుకొని తన మేనమామ గౌరీశంకరరావును బెంగళూరులో హతమార్చేందుకు లక్ష రూపాయలకు  ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో భాగంగా సరస్వతి తన ప్రియుడు శివ వద్ద రూ. 25 వేలు తీసుకొని శ్రీనివాసరావుకు అడ్వాన్స్‌గా చెల్లించింది. ఆ  తరువాత మరోసారి రూ. 11వేలు అందజేసింది. ఈ రెండు పేమెంట్లు ఆన్‌లైన్‌లో తేజ్‌ యాప్‌ ద్వారా శ్రీనివాసరావుకు చేరాయి. అనంతరం మరో 14 వేల రూపాయలను చేతికి నేరుగా అందజేసింది. అయితే డబ్బులు తీసుకున్న రాజాన శ్రీనివాసరావు తన తల్లికి బాగోలేకపోవడంతో  పథకాన్ని అమలు చేయలేకపోయాడు.

దీంతో సరస్వతికి  తన మేనమామ గౌరీశంకరరావుతో వివాహం జరిగిపోయింది. ఎలాగైనా తన భర్తను చంపాలని ప్రియుడు శివతో చర్చించి విశాఖపట్నానికి చెందిన రౌడీషీటర్‌ రామకృష్ణతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత పథకం ప్రకారం ఈ నెల 7న తోటపల్లి ఐటీడీఏ పార్క్‌ వద్ద దాడి చేసి గౌరీశంకర్‌ను హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటికే సరస్వతితో పాటు హత్యకు పాల్పడిన శివ , గోపి, రామకృష్ణ, బంగార్రాజు, కిశోర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

విచారణలో ముందుగా హత్యచేసేందుకు సుపారి తీసుకొని పథకం  పన్నిన శ్రీనివాసరావును విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకొని  7వ నిందితుడిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.  కార్యక్రమంలో సీఐ రాంబాబు, గరుగుబిల్లి ఎస్సై హరిబాబునాయుడులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు