కుమార్తెను కడతేర్చిన తల్లి, ప్రియుడు అరెస్టు

1 Jul, 2019 07:37 IST|Sakshi
హత్యకు గురైన మీరా, అరెస్టయిన అనీష్, మంజూషా(ఫైల్‌)

సాక్షి, చెన్నై : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కుమార్తెను హతమార్చిన తల్లిని, ప్రియుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం నెడుమంగాడు సమీపంలోగల తేక్కుంకరై ప్రాంతానికి చెందిన మంజూషా (34). ఈమె భర్త మృతిచెందాడు. కుమార్తె మీరా (16). అదే ప్రాంతంలోని పాఠశాలలో ప్లస్‌ఒన్‌ చదువుతోంది. మీరా అమ్మమ్మ వల్సలా ఇంట్లోనే ఉంటూ చదువుతోంది. ఇలావుండగా మంజూషాకు అదే ప్రాంతానికి చెందిన అనీష్‌కు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. మీరా అమ్మమ్మ ఇంట్లో ఉండడంతో వీరి సంబంధానికి ఎటువంటి అడ్డంకి లేకపోయింది. ఇలావుండగా రెండు వారాల క్రితం హఠాత్తుగా మీరా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తల్లి, యువకుడు ఉల్లాసంగా ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందింది. దీంతో మీరా తల్లిని నిలదీసింది. ఇందులో తల్లి, కుమార్తెల మధ్య గొడవ జరిగింది. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న మీరాను తొలగించుకునేందుకు ప్రేమజంట నిర్ణయించింది. ఇందుకు సమయం కోసం వేచి చూశారు. హఠాత్తుగా వారు మీరాను గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత ఆమె మృతదేహాన్ని అక్కడున్న ఒక పాడుబడిన బావిలో పారేశారు.

తర్వాత కుమార్తె మీరా ప్రేమికుడితో పరారైనట్లు, వారిని కనుగొనేందుకు వెళుతున్నట్లు మంజూష తన తల్లికి తెలిపింది. దీంతో వల్సలా కూడా దీన్ని నమ్మింది. అయితే మంజూషా వెళ్లి పది రోజులైనా తిరిగి రాలేదు. దీంతో దిగ్భ్రాంతి చెందిన వల్సలా నెడుమాంగాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అనీష్‌ కూడా అదృశ్యమైనట్లు తెలిసింది. ఇలావుండగా ఇరువురు ప్రేమికులు మంజూషా, అనీష్‌ నాగర్‌కోవిల్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని అందులో నివశించసాగారు. పోలీసులు తమను గుర్తించకుండా తమ సెల్‌ఫోన్‌ నంబర్లను మార్చివేశారు. అయినప్పటికీ సెల్‌ఫోన్‌ ఐఎంఈఐ నంబరు ఆధారంగా ఇరువురు ఉన్న స్థలాన్ని పోలీసులు కనుగొన్నారు. తర్వాత పోలీసులు నాగర్‌కోవిల్‌కు వెళ్లి వారిని పట్టుకుని కేరళకు తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో మీరా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు, తాము భయపడి మృతదేహాన్ని బావిలో పడేసినట్లు తెలిపారు.వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు వీరిని అనుమానించారు. ఇలావుండగా శనివారం మీరా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. ఆ నివేదికలో మీరాను గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. దీంతో ఇరువురిని పోలీసులు అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు.

మరిన్ని వార్తలు