అమ్మా! నాన్నా! నన్ను మర్చిపోండి..

26 Sep, 2019 12:36 IST|Sakshi
ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన పవిత్ర

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

సూసైడ్‌ నోట్‌ రాసి అఘాయిత్యం

తూర్పుగోదావరి,మండపేట: సరిగా చదవలేకపోతున్నానన్న ఆవేదన, తల్లిదండ్రులకు భారంగా ఉన్నానన్న బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన  మండపేటలోని గొల్లపుంతకాలనీలో చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన పట్టాభి వెంకట్రావు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంజినీరింగ్‌ చదువుతోంది. చిన్న కుమార్తె పవిత్ర పట్టణంలోని ప్రైవేట్‌ కళాశాలలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. తండ్రి లారీ డ్రైవర్‌ కావడంతో దూరప్రాంతం వెళ్లాడు. తల్లి పట్టణంలోని షాపులో పనిచేస్తుండగా ఆమె కూడా పనికి వెళ్లిపోయింది. పవిత్ర చదువుకుంటానని చెప్పి మంగళవారం కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయింది. మధ్యాహ్న సమయంలో నాయనమ్మ ఇంటికి వచ్చి చూడగా ఇంటికి గెడ వేసి ఉండడంతో పడుకుని ఉంటుందని ఆమె వెనక్కి వెళ్లిపోయింది. మూడు గంటల సమయంలో మరోసారి వచ్చి చూసే సరికి తలుపు వేసి ఉండడంతో తలుపుకొట్టిన పవిత్ర తలుపు తీయలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బలంగా తెరిచి చూడగా సిల్క్‌ చీరతో ఉరివేసుకుని కింద పడి ఉంది. వెంటనే స్థానిక వైద్యులను పిలిచి చూపించగా అప్పటికే ఆమె మృతిచెంది ఉన్నట్టు గుర్తించారు. సిల్క్‌ చీరతో ఉరివేసుకోవడంతో అది కొద్దిసేపటికి జారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

పేరుపేరునా క్షమించమని కోరుతూ..
అక్క మెరిట్‌ విద్యార్థి కావడంతో ర్యాంకు సాధించి ఇంజినీరింగ్‌ చదువుకుంటున్నట్టు స్థానికులు తెలిపారు. పవిత్ర సరిగా చదవలేకపోయేది. ‘నేను మీకు ఏ విధంగా సహాయపడలేనని, అమ్మా! నాన్నా! నన్ను మర్చిపోండి’ అంటూ నోట్‌బుక్‌లో సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. బంధువులు, స్నేహితులు అందరినీ పేరుపేరునా ప్రస్తావించి క్షమించమని కోరుతూ ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలంలో ఈ లేఖ లభ్యమైనట్టు పట్టణ పోలీసులు తెలిపారు. కుమార్తె మృతితో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. రోజూ కళ్లముందు తిరిగే అమ్మాయి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుందనుకోలేదంటూ చుట్టుపక్కల వారు విషాదంలో మునిగిపోయారు. తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై టి.సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా