లేడీ డాన్‌ హల్‌చల్‌!

14 Jan, 2019 12:23 IST|Sakshi
ఈ ప్రాంతంలోనే లేడీ డాన్‌ చక్రం తిప్పేది

చిరు వ్యాపారులు, కార్మికులే టార్గెట్‌

వడ్డీలపై చక్రవడ్డీలు

ఇవ్వకపోతే చితకబాదుడు

అవకాశముంటే కబ్జా

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

కృష్ణాజిల్లా, తాడేపల్లిరూరల్‌ (మంగళగిరి): రాజధాని పరిధిలోని తాడేపల్లి మున్సిపాలిటీలో ఓ లేడీ డాన్‌ హల్‌చల్‌ చేస్తోంది. దాదాపుగా రెండు ప్రాంతాల్లో చక్రం తిప్పుతూ తనదైన శైలిలో దౌర్జన్యం చేస్తూ, పేద బలహీన వర్గాల వారిని టార్గెట్‌ చేస్తోంది. అవసరాల నిమిత్తం రూ.10 వేలు, రూ.20 వేలు ఇచ్చి వడ్డీకి చక్రవడ్డీ వేసి రూ.20 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేస్తోంది. సకాలంలో ఇవ్వకపోతే వారిపై దౌర్జన్యం చేయడమే కాకుండా చితకబాది మరీ వారి వద్ద ఉన్న ఆస్తులను కబ్జా చేసి తన వశం చేసుకుంటోంది. ఇలాంటి సంఘటనే తాజాగా నులకపేటలో సదరు లేడీ డాన్‌ దెబ్బకు ఓ ఆటో డ్రైవర్‌ తన ఆటోను అప్పజెప్పి, ఏం చేయాలో అర్థంకాక చివరకు పోలీసులను ఆశ్రయించాడు. సేకరించిన వివరాల ప్రకారం.. నులకపేట ప్రాంతంలో నివసించే నాంచారయ్య వద్ద డ్రైవర్‌గా పనిచేసే విజయ్, అతని స్నేహితుడు సదరు మహిళ వద్ద రూ.10 వేలు నగదు తీసుకున్నారు.

సకాలంలో ఆ నగదు చెల్లించకపోవడంతో రెండు రోజుల క్రితం విజయ్‌ తోలుతున్న ఆటోను సదరు మహిళ లాక్కొని, వడ్డీతో సహా రూ.20 వేలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేసింది. ఆటో డ్రైవర్‌ విజయ్‌ జరిగిన విషయాన్ని ఆటో యజమాని నాంచారయ్యకు చెప్పగా, నాంచారయ్య నా ఆటో నాకు ఇవ్వాలని సదరు లేడీ డాన్‌ను అడగ్గా, ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నీకు చేతనైంది నువ్వు చేస్కో అని తేల్చి చెప్పింది. జరిగిన సంఘటనపై నాంచారయ్య శుక్రవారం నుంచి ఆది వారం వరకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పడిగాపులు గాచినా ఎటువంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. డ్రైవర్, అతని స్నేహితుడు డబ్బులు తీసుకుంటే మేమేం చేయాలి.., మా ఆటో లాక్కోవడం ఏమిటని ప్రశ్నించినా ప్రయోజనం లేదని నాంచారయ్య  తెలియజేశాడు.

గతంలో ఈ మహిళ నులకపేట ప్రాం తంలో ఓ ఆటో ఓనర్‌ను కరెంటు స్తంభానికి కట్టేయగా, పోలీసులు వెళ్లడంతో అతన్ని విడిచిపెట్టారు. అప్పుడు కూడా ఎటువంటి కేసూ నమోదు కాలేదు. సదరు మహిళ నులకపేట, పరిసర ప్రాం తాల్లోని రోజువారీ కూలీలు, కార్మికులను టార్గెట్‌ చేసి, వారి అవసరాల దృష్ట్యా రూ.10 వేలు, రూ. 20 వేలు ఇచ్చి, వారానికి రూ.10 వేలైతే రూ.1000 వడ్డీ, రూ.20 వేలైతే రూ.2000లు వడ్డీ వసూలు చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు దృష్టికి వచ్చినా మీరెందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎవరికైనా అస్వస్థత చేసినప్పుడు, ఆటోలు రిపేర్‌ అయినప్పుడు ఆమె బారిన పడక తప్పట్లేదని, అయితే ఆమె చెప్పిన నగదు మొత్తం చెల్లిస్తున్నప్పటికీ 2, 3 రోజులు ఆలస్యమైతే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతోందని స్థానికులు అంటున్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న లేడీ డాన్‌పై రాజధాని పోలీసులు చర్యలు తీసుకుంటారా? లేక ఎందుకొచ్చిందిలే అని వదిలేస్తారో వేచిచూడాల్సిందే.

మరిన్ని వార్తలు