అద్దె ఎగ్గొట్టడానికి యువకుడి మాస్టర్‌ ప్లాన్‌!..

26 Aug, 2019 11:53 IST|Sakshi

న్యూ ఢిల్లీ : పెద్ద మొత్తంలో పేరుకుపోయిన అద్దె బకాయిని ఎగ్గొట్టడానికి ఓ యువకుడు చావు తెలివితేటలు ఉపయోగించాడు. తనను తాను తుపాకితో కాల్చుకుని.. ఇంటి యాజమాని చంపబోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు అడ్డంగా దొరికిపోయి జైలు పాలయ్యాడు. న్యూ ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన సునీత్‌ భదన అమర్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో గత కొన్ని నెలలుగా పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటున్నాడు. అద్దె చాలా కాలంనుంచి చెల్లించకపోవటంతో బకాయిలు రూ. 2లక్షల దాకా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అద్దె చెల్లించాలంటూ ఇంటి యాజమాని వరుణ్‌ జునేజ.. సునీత్‌పై ఒత్తిడి తీసుకురాసాగాడు. అద్దె విషయమై 23వ తేదీన ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రాత్రికంతా డబ్బు ఇవ్వాలని వరుణ్‌ గట్టిగా హెచ్చరించి అక్కడనుంచి వెళ్లిపోయాడు. అద్దె ఎలాగైనా ఎగ్గొట్టాలని నిశ్చయించుకున్న సునీత్‌ ఓ పథకం వేశాడు. తనను తాను తుపాకితో కాల్చుకుని ఆసుపత్రిలో చేరాడు. అనంతరం పోలీసులకు వరుణ్‌పై ఫిర్యాదు చేశాడు.

సునీత్‌ కథనం, ఇంట్లోని రక్తపు మరకల ఆధారంగా పోలీసులు అతడు చెప్పింది నిజమేనని నమ్మారు. వెంటనే వరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను సునీత్‌ను కాల్చలేదని వరుణ్‌ చెప్పటం, తప్పించుకోవటానికి ప్రయత్నం చేయకుండా అతడు పోలీసులకు సహకరించటంతో వారిలో అనుమానాలు బయలుదేరాయి. ఆసుపత్రిలో ఉన్న సునీత్‌ను మళ్లీ విచారించటంతో అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఆ మరుసటి రోజే  ఆసుపత్రినుంచి పరారయ్యాడు. సునీత్‌ కోసం గాలించిన పోలీసులు సోదరి ఇంట్లో తలదాచుకున్న అతడిని అరెస్ట్‌ చేశారు. అద్దె ఎగ్గొట్టడానికే కాల్పుల నాటకం ఆడినట్లు పోలీసుల విచారణలో సునీత్‌ తెలిపాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా