దుకాణానికి వెళ్లి... దూరమై

13 Mar, 2018 13:25 IST|Sakshi
మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు

గుర్తుతెలియని    వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం

కొత్తపల్లి సమీపంలో ఘటన

ముకుందపురంలో    విషాదఛాయలు

శ్రీకాకుళం, మందస: ముకుందపురం గ్రామానికి చెందిన తలగాన జోగారావు(38) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కొత్తపల్లి సమీపంలోని స్వర్ణ చతుర్భుజి రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. వివరాలిలా ఉన్నాయి. జోగారావు మండలంలోని హరిపురంలో ఓ చిన్న బట్టల దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ ఉదయాన్నే ఇంటి నుంచి హరిపురం సైకిలుపై వెళ్లి రాత్రి మళ్లీ ముకుందపురం వస్తుంటాడు.

యథావిధిగానే ఆదివారం ఉదయం హరిపురం వెళ్లిన జోగారావు రాత్రికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు ఫోన్‌కు ప్రయత్నించగా, ఎత్తకపోవడంతో రాత్రి గాలించారు. సోమవారం ఉదయాన్నే గుర్తుతెలియని మృతదేహం కొత్తపల్లి సమీపంలో ఉందని తెలుసుకుని వెళ్లి చూసే సరికి మృతుడు జోగారావు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, ఆదివారం రాత్రే ఈ సంఘటన జరిగి ఉంటుందని అంటున్నారు. హరిపురం నుంచి ముకుందపురం వస్తున్న జోగారావును కొత్తపల్లి గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సైకిలుపై నుంచి ఎగిరి పడిన ఆయన తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించినట్టు స్థానికులు భావిస్తున్నారు. మృతుడికి భార్య తులసమ్మ, కుమార్తె పల్లవి(9), కుమారుడు నితిన్‌(2) ఉన్నారు. ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న జోగారావు ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు రోదన ఆపడం ఎవరితరం కాలేదు. మందస ఎస్‌ఐ యర్ర రవికిరణ్‌(బారువా ఇన్‌చార్జి) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు