గోదావరిలో యువకుడు గల్లంతు

14 Jul, 2019 09:02 IST|Sakshi
పడవ నిర్వాహకుడు రక్షించిన నలుగురు, గల్లంతైన యువకుడు భాస్కరసాయి

ఆచంట(పశ్చిమగోదావరి) : కోడేరు వద్ద గోదావరిలో సాన్నానికి దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పడవ నడిపే వ్యక్తి సకాలంలో స్పందించడంతో మునిగిపోతున్న మరో నలుగురిని రక్షించాడు. ఈ సంఘటన ఆచంట మండలం కోడేరు వశిష్ట గోదావరిలో చోటు చేసుకుంది. ప్రమాదంలో పోడూరు గ్రామానికి చెందిన పోడూరి భాస్కరసాయి (21) అనే యువకుడు గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే పోడూరు గ్రామానికి చెందిన భాస్కరసాయి హైదరాబాద్‌లోని ఓ ప్రేవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఇదే కంపెనీలో పనిచేస్తున్న మరో ఆరుగురు మిత్రులు జమ్ము కార్తీక్, పాండవుల తరుణ్‌కుమార్, కుబ్బిరెడ్డి రాజు, కలిగితి రాజేష్, సువ్వాపు రాంబాబు, జి.వినోద్‌లతో కలిసి శుక్రవారం ద్వారకాతిరుమల చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భాస్కరసాయి స్వగ్రామమైన పోడూరులో రాత్రి బస చేసి శనివారం ఉదయం కోడేరులోని వశిష్ట గోదావరికి గోదావరి అందాలు తిలకించి, స్నానాలు ఆచరించడానికి వచ్చారు. వీరందరూ అవివాహితులే. ఉదయం 10 గంటల ప్రాంతంలో కోడేరు చేరుకున్న వారు సమీపంలోని తగినంత నీటి ప్రవాహం లేకపోవడంతో ఇసుక తిన్నెల çమీదుగా సమీపంలోని మరో పాయ వద్దకు చేరుకుని స్నానాలకు దిగారు. ఆడుతూ పాడుతూ వారు గోదావరిలో కొద్దిసేపు స్నానాలు ఆచరించారు. 

నలుగురిని రక్షించిన బోటు నిర్వాహకుడు
కోడేరు వశిష్ట గోదావరి అవతలి ఒడ్డున ఉండే ఈ పాయ లోతు అధికం. ఇది స్థానికులకు మాత్రమే తెలుసు. బయటి ప్రాంతాల వారికి తెలియదు. అయితే ఇది తెలియని భాస్కరసాయి అతని మిత్రులు అక్కడికి చేరుకుని స్నానాలకు దిగారు. ఆడుతూ పాడుతూ జలకాలాడుతున్న సమయంలో భాస్కరసాయి ఒక్కసారిగా మునిగిపోసాగాడు. మిత్రులు తరుణ్‌కుమార్, రాజు, రాజేష్, వినోద్‌లు మునిగిపోతున్న మిత్రుడిని రక్షించే క్రమంలో వారూ ప్రమాదంలో పడి గట్టిగా కేకలు వేశారు. ఆ సమయంలో పెద్దగా అరవడంతో సమీపంలో ఒడ్డున ఉన్న బోటు నిర్వాహకుడు కొప్పాడి కాళీ సాయి వెను వెంటనే స్పందించి ఇంజన్‌ బోటులో సంఘటనా స్థలానికి చేరుకుని మునిగిపోతున్న వారి వద్దకు పడవ చేర్చి వారిని సురక్షితంగా పడవలోకి లాగి నలుగురి యువకుల ప్రాణాలు కాపాడాడు. అప్పటికే భాస్కరసాయి గల్లంతయ్యాడు. ఈ ఘటనలో మిత్రుడు గల్లంతుకావడంతో విషాదఛాయలు అలముకున్నాయి. తహసీల్దార్‌ బాలసుబ్రహ్మణ్యం, ఆచంట ఎస్సై రాజశేఖర్‌ ఘటనాస్థలం వద్దకు చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా