దొంగతనానికి పాల్పడ్డ మిలియనీర్‌

15 Jul, 2018 11:18 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ నేషనల్‌ మ్యూజియంలో అత్యంత విలువైన, పురాతన కాలానికి చెందిన ఓ రాతి గొడ్డలి జూన్‌ 24వ తేదీన చోరికి గురయింది. ఈ విషయం తెలిసిన మ్యూజియం అధికారులు దానిని ఎవరు తీశారో తెలుసుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేశారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. అందులో ఆ వస్తువును దొంగిలించిన వ్యక్తి కదలికలను గర్తించినప్పటికీ.. అతను ఎవరో తెలుసుకోలేకపోయారు. దీంతో మ్యూజియం అధికారులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తి గుర్గావ్‌కు చెందిన మిలియనీర్‌ ఉదయ్‌ రాత్రగా గుర్తించారు. శుక్రవారం రాత్రి ఉదయ్‌ ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఐపీఎస్‌ అధికారి మధుర్‌ వర్మ ట్విటర్‌లో స్పందించారు. ఈ పురాతన చేతి గొడ్డలి లక్షల ఏళ్ల కిందట మానవులు తమ రక్షణకు ఉపయోగించిందన్నారు. ఉదయ్‌కు గతంలో కూడా నేర చరిత్ర ఉందని పేర్కొన్నారు. 20 ఏళ్లు యూకేలో ఉన్న ఉదయ్‌ను అక్కడి అధికారులు 2006లో ఇండియాకు పంపిచేశారని తెలిపారు. 2016లో యూఎస్‌ విదేశాంగ సెక్రటరీ జాన్‌ కెర్రీ ఓ హోటల్లో బస చేసిన సమయంలో అక్కడ భయానక వాతావరణం సృష్టించడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. తాజా ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా విడుదల చేశారు.

మరిన్ని వార్తలు