కుటుంబాన్ని చిదిమేసిన మద్యం మహమ్మారి

2 Aug, 2019 07:27 IST|Sakshi
టెంకాయతోటలో తల్లి, కుమార్తె మృతదేహాలు

కుమార్తెను కడతేర్చి తల్లి ఆత్మహత్య

మద్యానికి బానిసైన భర్త వేధింపులు భరించలేక బలవన్మరణం

సాక్షి ప్రతినిధి,చెన్నై: నిండైన ఆ కుటుంబాన్ని మద్యం మహమ్మారి బలితీసుకుంది. మద్యానికి బానిసైన భర్త పెట్టే వేధింపులు భరించలేక ఒక గృహిణి కుమార్తెను కడతేర్చి తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది. వివరాలు.. నామక్కల్‌ జిల్లా తిరుచెంగోట్టైకి చెందిన రాజా (42)కు భార్య సుధ (35), ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం చదివే కుమారుడు సూర్య (19), పదోతరగతి చదువుతున్న కుమార్తె కార్తిక (16) ఉన్నారు. మద్యానికి బానిసైన రాజా తన సంపాదనలో ఎక్కువశాతం తాగుడుకే ఖర్చు చేయడంతో దంపతుల మధ్య రోజూ గొడవలు చోటుచేసుకునేవి.

దీంతో సుధ కుమారుడిని తండ్రి వద్దే వదిలి కుమార్తెను వెంటపెట్టుకుని కొన్నిరోజుల క్రితం ఇల్లువదిలిపెట్టింది. ఆమె తమ్ముడి ఇంటిలో ఉంటోంది. అయినా వదలని రాజా భార్యకు ఫోన్‌ చేసి కాపురానికి రావాల్సిందిగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు భరించలేక పోయిన సుధ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ప్రకారం బుధవారం సాయంత్రం కుమార్తెను వెంటపెట్టుకుని స్కూటీలో బయలుదేరింది. సుధ సమీపంలోని తంగరాజ్‌ అనే వ్యక్తికి చెందిన టెంకాయతోటకు చేరుకుంది. మార్గమధ్యంలో కొనుగోలు చేసిన తోటలకు వినియోగించే సల్పాస్‌ మాత్రలు, ఎలుకల మందును కుమార్తె కార్తిక చేత తినిపించించి తాను తినింది. విషం తీవ్రతకు కొద్దిసేపటిలోనే కుమార్తె కిందపడి గిలగిలకొట్టుకుంటూ మృతి చెందింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సుధను తంగరాజ్, తోట కార్మికులు గుర్తించారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో ప్రాణాలు విడిచింది. ఈ సమాచారంతో వాంగల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు