దాగని నిజం

8 Apr, 2019 06:54 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మహ్మద్‌ ఖాజా (ఫైల్‌)

18 ఏళ్లకు కొలిక్కి వచ్చిన హత్య కేసు

వేధిస్తున్నాడని కుమారుడిని చంపించిన తల్లి

కుటుంబ కలహాల నేపథ్యంలో వెలుగులోకి..

ముగ్గురు నిందితుల అరెస్టు  

సాక్షి, సిటీబ్యూరో: దాదాపు 18 ఏళ్ల క్రితం జరిగిన హత్య అది... సూత్రధారిగా ఉన్న హతుడి తల్లి, పాత్రధారులైన బంధువులు, స్నేహితులు ఇన్నేళ్లు స్వేచ్ఛగా సమాజంలో తిరిగారు... కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ ఘాతుకం ఇన్నాళ్లకు బయటకు పొక్కింది... లోతుగా ఆరా తీసిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ హత్యకు సూత్రధారి అయిన హతుడి తల్లి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదివారం వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్, రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌చక్రవర్తిలతో కలిసి వివరాలు వెల్లడించారు. హష్మాబాద్‌కు చెందిన మసూదా బీ, మహ్మద్‌ సాబ్‌ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు కాగా, ఐదుగురు ఆడపిల్లలు. మహ్మద్‌ సాబ్‌ 30 ఏళ్ల క్రితమే కన్నుమూయడంతో అప్పటి నుంచి అన్నీ తానై కుటుంబాన్ని పోషించిన మసూదా బీ ఆడపిల్లలకు వివాహాలు చేయడంతో పాటు మగవాళ్లను సెటిల్‌ చేసింది.

అయితే రెండో కుమారుడు మహ్మద్‌ ఖాజా మాత్రం ఆమెకు తలనొప్పిగా మారాడు. చిన్నతనం నుంచే మద్యం, పేకాట తదితర వ్యవసనాలకు బానిసైన అతను డబ్బు కోసం తల్లితో పాటు కుటుంబసభ్యులను వేధించేవాడు. దీనికితోడు వారి ఇంటిని సైతం పేకాట శిబిరంగా మార్చేశాడు. ఓ దశలో ఖాజా వేధింపులు తట్టుకోలేకపోయిన ఉమ్మడి కుటుంబం హష్మాబాద్‌ నుంచి అల్‌ జుబైల్‌కాలనీకి మకాం మార్చింది.  అయినా అతను వేధింపులు మానుకోలేదు. నిత్యం ఆ ఇంటికీ వెళ్తూ తనకు డబ్బు ఇవ్వకపోతే హష్మాబాద్‌లోని ఇల్లు అమ్మేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. ఖాజా చివరకు తన భార్యతోనూ నిత్యం ఘర్షణ పడుతూ డబ్బు కోసం ఆమెనూ వేధించేవాడు. అతడి ధోరణి ఇలాగే కొనసాగితే కుటుంబం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన మసూదా బీ అతడిని అడ్డు తొలగించుకునేందుకు అల్లుళ్లు రషీద్, బషీర్‌లతో పాటు ఖాజా స్నేహితుడు సయ్యద్‌ హషమ్‌తో చర్చలు జరిపింది. వీరంతా కలిసి ఖాజాను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం 2001 జూన్‌ 4న ఖాజాకు కల్లు ఆశచూపిన రషీద్, బషీర్, హషమ్‌ అతడికి బండ్లగూడకు తీసుకువెళ్లారు. హషమ్‌కు చెందిన ఆటోలో అక్కడికి వెళ్లిన నలుగురూ ఓ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగారు.

అక్కడి నుంచి ఖాజాను శాస్త్రీపురంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఓ ద్రాక్ష తోటలో అతడిని కూర్చోపెట్టిన వారు అదును చూసుకుని అతడిపై బండరాళ్లతో దాడి చేసి చంపేశారు. మృతదేహాన్ని అక్కడే వదిలి తిరిగి వచ్చిన వీరు మసూదా బీకి విషయం చెప్పారు. అప్పట్లో ఖాజా శవాన్ని గుర్తించిన స్థానికులు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హతుడు, హంతకులకు సంబంధించి ఆధారాలు దొరక్కపోవడంతో కొలిక్కిరాని కేసుగా పరిగణించి ఫైల్‌ మూసేశారు. అప్పటి నుంచి మసూదా బీ సహా ఎవరూ ఈ హత్య విషయం బయటపెట్టలేదు. అయితే కొన్ని రోజుల క్రితం మసూదా బీ ఇంట్లోనే గొడవ జరిగింది.

ఈ నేపథ్యంలో ఈమెకు అల్లుళ్లతో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారు ఖాజాను చంపడం ద్వారా నీకు చాలా సహాయం చేశామని, ఇప్పటి వరకు ఆ విషయం బయటకు చెప్పలేదని నోరు జారారు. దీనిపై సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు మహ్మద్‌ తఖియుద్దీన్, ఎన్‌.శ్రీశైలం, కేఎన్‌ ప్రసాద్‌వర్మ, వి.చక్రవర్తి లోతుగా ఆరా తీశారు. నిందితుల్లో ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2010లో రాజేంద్రనగర్‌ ఠాణా నుంచి వేరుగా మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్‌ ఏర్పడింది. దీంతో ప్రస్తుతం నిందితులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్ప గించి పరారీలో ఉన్న మసూదా బీ కోసం కోసం గాలిస్తున్నారు. ‘నగరంలో ఎవరు నేరం చేసినా? ఎన్నాళ్ళ క్రితం చేసినా? పోలీసుల నుంచి తప్పించుకోలేరు అనడానికి ఈ కేసు ప్రత్యక్ష నిదర్శనం’ అని నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు