పక్కనే ఉన్నా పసిగట్ట లేక..

12 Jan, 2019 09:37 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితుడు బిజయ్‌ పూలకుండీలో జయప్రకాష్‌ అస్థిపంజరం

జయప్రకాష్‌ కోసం పలుమార్లు ఢిల్లీ వెళ్లిన అతడి తల్లి

కొడుకు శవం సమీపంలోనే బస!

కొన్నాళ్ల పాటు హత్య జరిగిన అపార్ట్‌మెంట్‌లోనే మకాం

ఆ శవం పూడ్చిన పూల కుండీల వద్దే కూర్చున్న వైనం

మూడు నెలలు తప్పించుకు తిరిగిన నిందితుడు

అనేక నగరాల్లో సంచరించిన తర్వాతే హైదరాబాద్‌కు

‘ఢిల్లీ హత్య’ కేసులో ఆసక్తికర కోణాలు వెలుగులోకి

సాక్షి, సిటీబ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన మెదక్‌ వాసి జయ ప్రకాష్‌ మహారాణ కేసు దర్యాప్తులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కుమారుడు అదృశ్యమైనట్లు తెలియడంతో అక్కడికి వెళ్లిన అతడి తల్లి హత్య జరిగిన గదిలోనే చాలాసార్లు బస చేసింది. ఆ సమయంలో ఆమె శవాన్ని పూడ్చిపెట్టిన పూలకుండీల వద్దే ఎక్కువ సమయం గడిపేదని వెల్లడైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హతుడి మామ బిజయ్‌ కుమార్‌ మహారాణ మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. పలు నగరాల్లో సంచరించిన అనంతరం హైదరాబాద్‌ చేరుకున్న అతను బోడుప్పల్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఢిల్లీ పోలీసులు గత వారం అతడిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ద్వారక ఏరియా యాంటీ ఆటో థెఫ్ట్‌ స్క్వాడ్‌ (ఏఏటీఎస్‌) ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌ కుమార్‌ శుక్రవారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు.

అదృశ్యమని తెలియడంతోనే పరుగున...
ఒడిస్సాలోని గంజాం జిల్లాకు చెందిన జ్యోత్న్స రాణి, ప్రదీప్‌ దంపతుల కుమారుడే జయ ప్రకాష్‌ మహారాణ. వీరు కొన్నేళ్ల క్రితం తెలంగాణకు వలసవచ్చి మెదక్‌ సమీపంలో స్థిరపడ్డారు. జ్యోత్న్స సోదరుడు బిజయ్‌ కుమార్‌ బరంపురంలో బీసీఏ పూర్తి చేశాడు. 2012లో ఢిల్లీకి వెళ్లిన అతను నోయిడాలోని ఓ బీపీఓ కంపెనీలో సీనియర్‌ అసోసియేట్‌గా పని చేస్తున్నాడు. చదువుకునే రోజుల్లో అతడికి పరిచయమైన ప్రియాంక(పేరు మార్చారు) ఉద్యోగం కోసం ఢిల్లీకి రాగా అక్కడ కూడా వీరి ప్రేమాయణం కొనసాగింది. హైదరాబాద్‌లో ఉన్నత విద్య పూర్తి చేసిన జయప్రకాష్‌ 2015లో ఉద్యోగం కోసం ఢిల్లీలోని తన మేనమామ వద్దకు వెళ్లాడు. వీరిద్దరూ దాదాపు సమవయస్కులు కావడంతో  స్నేహితుల్లా ఉండేవారు. దాబ్రీ ప్రాంతంలోని చాణక్యపురి ప్లేస్‌లోని విక్రమ్‌ సింగ్‌ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో అద్దెకు ఉండేవారు. ఈ ఫ్లాట్‌కు తరచూ వచ్చే ప్రియాంకకు జయప్రకాష్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ వాట్సాప్, ఫోన్‌కాల్స్‌ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నట్లు తెలియడంతో బిజయ్‌ అసూయ పెంచుకున్నాడు. క్రికెట్‌ బెట్టింగ్స్‌ ఆడే బిబయ్‌ 2016 ఫిబ్రవరిలో భారీగా నష్టపోయి తీవ్ర నిరాశకు లోనయ్యాడు. దీనికితోడు తన ప్రేయసితో సన్నిహితంగా ఉంటున్నాడని జయ ప్రకాష్‌పై కక్షకట్టాడు.  

అనుమానం రానీయకుండా..
జయ ప్రకాష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్న బిజయ్‌ 2016 ఫిబ్రవరి 7న తెల్లవారుజామున 2 గంటలకు నిద్రలో ఉన్న అతడి తలపై సీలింగ్‌ ఫ్యాన్‌ మోటర్‌తో మోది చంపాడు. శవాన్ని బెట్‌షీట్, బ్లాంకెట్‌ల్లో చుట్టేశాడు. ఆపై యజమాని అనుమతితో బాల్కనీలో పూలకుండీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి మట్టిని తెచ్చి మృతదేహాన్ని పూడ్చేశాడు. అదే నెల 12న దాబ్రీ పోలీసులకు జయ ప్రకాష్‌ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీనిపై సమాచారం అందడంతో జయ ప్రకాష్‌ తల్లి జ్యోత్న్స పలుమార్లు ఢిల్లీ వెళ్లి తన కుమారుడి హత్య జరిగిన ఫ్లాట్‌లోనే ఉండి ఆరా తీసింది. అప్పట్లో బిజయ్‌ ఆమెతో... ‘బ్లూ జాకెట్‌ వేసుకుని అందంగా తయారయ్యాడు. తన స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయాడు’ అంటూ చెప్తూ తనపై ఎలాంటి అనుమానం రాకుండా మసలుకున్నాడు. కుమారుడి కోసం ఎదురు చూసిన ఆ తల్లి శవాన్ని పూడ్చిపెట్టిన పూల కుండీల వద్దే ఎక్కువ సేపు గడిపేది. తనకు సమీపంలోనే కుమారుడి మృతదేహం ఉందని 2018 అక్టోబర్‌ 8న శవం బయటపడే వరకు ఆమెకు తెలియలేదు.  

అనేక ప్రాంతాల్లో మకాం మార్చి...
ఆ ఫ్లాట్‌ ఖాళీ చేసిన బిజయ్‌ అక్కడే మరికొన్నాళ్లు తలదాచుకున్నాడు. దాదాపు రెండేళ్లుగా ఫేస్‌బుక్‌ సహా అన్ని కాంటాక్ట్‌ కట్‌ చేసుకోవడంతో పాటు తన ఫోన్‌ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు కూడా పూర్తిగా మార్చేశాడు. ఢిల్లీని వదలడానికి ముందే తన బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేశాడు. ఢిల్లీ నుంచి నోయిడా, అక్కడి నుంచి అంబాలా, సోనీపట్, పానిపట్‌లతో పాటు హర్యానాలోని అనేక ప్రాంతాల్లో తిరిగాడు. బిజయ్‌ సోషల్‌మీడియా ఖాతాలకు సంబంధించిన సమాచారం సేకరించిన పోలీసులు వాటిని పూర్తి స్థాయిలో విశ్లేషించారు. ఫలితంగా అతని ప్రియురాలు ప్రియాంక సమాచారం తెలిసింది. ఆమెను సంప్రదించగా బిజయ్‌ తనతో చాలాకాలంగా టచ్‌లో లేడని, ఆఖరుసారిగా తనను కలిసినప్పుడు మాత్రం ఢిల్లీలోని నన్‌గ్లోయ్‌లో ఉంటున్నట్లు చెప్పాడని తెలిపింది. అయితే బిజయ్‌ తరచూ తనకు విశాఖపట్నంలో ఓ ప్రాణ స్నేహితుడు ఉన్నాడని చెప్పేవాడని పేర్కొంటూ అతడి పేరు, వివరాలు చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం విశాఖకు వెళ్లి బిజయ్‌ స్నేహితుడిని ప్రశ్నించింది.  

బోడుప్పల్‌లో కనిపించాడని చెప్పడంతో...
అతను కూడా బిజయ్‌ చాలా కాలంగా తనతోనూ దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. దాదాపు రెండేళ్లుగా సోషల్‌మీడియా, ఫోన్‌ సహా ఏ విధంగానూ టచ్‌లో లేనట్లు తెలిపాడు. అయితే తాను కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన సమయంలో బోడుప్పల్‌ ప్రాంతంలో తారసపడినట్లు చెప్పిన ఆ స్నేహితుడు... తాను మాట్లాడటానికి ప్రయత్నించినా తానెవరో తెలియనట్లు వెళ్లిపోయాడన్నాడు. దీంతో విశాఖ నుంచి హైదరాబాద్‌ వచ్చిన బృందం బోడుప్పల్‌లో వారం రోజుల పాటు కాపు కాసింది. ఎట్టకేలకు గత శనివారం బిజయ్‌ను అదుపులోకి తీసుకుని ఢిల్లీ తరలించింది.  

ఢిల్లీ వార్తలపై ఆసక్తి...
ఇతను దేశంలో ఎక్కడ ఉన్నా ఢిల్లీకి సంబంధించిన వార్తాపత్రికలను ఆన్‌లైన్‌లో చూస్తుండేవాడు. ఎక్కడైనా తన మేనల్లుడి శవం బయటపడిన వార్త వచ్చిందా? అని నిశితంగా గమనించేవాడు. మూడు నెలల క్రితం ఆ వార్త ప్రచురితమైన తర్వాత ఏ ఒక్క ప్రాంతంలోనూ ఉండకుండా తిరుగుతూ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి బోడుప్పల్‌లోని ఇంజినీరింగ్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా చేరాడు. డబ్బు సంపాదించడం కోసం సినిమాలో నటించాలని భావించిన ఇతగాడు కొన్ని రోజుల ముందు హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ఆడిషన్స్‌కు వెళ్లినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు