నాలాగ ఎంతోమంది ఉన్నారు: ఉదిత్‌ సూర్య

29 Sep, 2019 14:28 IST|Sakshi

నాలాగ ఎందరో అని చెప్పిన ఉదిత్‌ సూర్య

 విద్యార్దిని, ఇద్దరు విద్యార్దులు అరెస్ట్‌

ముగ్గురు తండ్రులు కటకటాల్లోకి

తొమ్మిదికి చేరిన అరెస్ట్‌ సంఖ్య

సాక్షి ప్రతినిధి, చెన్నై: నీట్‌గా పరీక్ష రాసి వైద్య విద్యను అభ్యసించాల్సిన విద్యార్దులు వక్రమార్గాన్ని ఎన్నుకుని ఎట్టకేలకు దొరిపోతున్నారు. తప్పుటడుగులు వేస్తున్న తమ పిల్లలను సరిదిద్దాల్సిన తండ్రులే తప్పిదాలకు పోయి పోలీసులకు చిక్కిపోతున్నారు. నీట్‌ పరీక్ష మోసంలో తాజాగా ఒక విద్యార్ది, ఇద్దరు విద్యార్దులు తమ తండ్రులతో సహా మొత్తం ఆరుగురు జైలుపాలయ్యారు. దీంతో నీట్‌ మోసం వ్యవహారంలో అరెస్ట్‌ల సంఖ్య తొమ్మిదికి చేరింది. 

కష్టపడి చదివి నీట్‌ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యం పక్కదోవపట్టగా చెన్నైకి చెందిన ఉదిత్‌ సూర్య అనే విద్యార్దిని, అతడి తండ్రి డాక్టర్‌ వెంకటేశన్‌ను సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.  కాగా, పోలీసుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న ఉదిత్‌ సూర్య తనలాగ ఎందరో అని చెప్పడం అధికారులను కలవరానికి గురిచేసింది. మరి కొందరు విద్యార్దులు సైతం నకిలీ విద్యార్ది చేత నీట్‌ పరీక్ష రాయించి వైద్యసీటు సంపాదించారని సీబీసీఐడీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. వారు ఎవరెవరో కూడా చెప్పడంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

చెన్నైకి చెందిన విద్యార్దిని అభిరామి, విద్యార్దులు ప్రవీణ్, రాహుల్‌ సైతం ఉదిత్‌ సూర్య తరహాలో మరోవ్యక్తి చేత పరీక్ష రాయించి సీటు సంపాదించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. విద్యార్దిని అభిరామి తిరుప్పోరూరు సమీపం అమ్మాపేటలోని సత్యసాయి వైద్య కళాశాలలో, విద్యార్దులు ప్రవీణ్‌ క్రోంపేటలోని బాలాజీ వైద్య కళాశాలలో, రాహుల్‌ కాంట్రాకొళత్తూరులోని ఎస్‌ఆర్‌ఎమ్‌ వైద్యకళాశాలలో చదువుతున్నారు. ఉదిత్‌ సూర్య తండ్రి డాక్టర్‌ వెంకటేశన్‌ లాగానే ఈ ముగ్గురు విద్యార్దులు తండ్రులు సైతం తమ పిల్లల కోసం మోసానికి పాల్పడ్డారు. ప్రవీణ్‌ తండ్రి రూ.23 లక్షలు చెల్లించాడు. మిగిలిన ఇద్దరు రూ.20 లక్షలు చొప్పున ఇచ్చుకున్నారు. ఈ ముగ్గురు విద్యార్దుల తండ్రులు బ్రోకర్‌కే డబ్బులు ఇచ్చుకున్నారు. అభిరామి తండ్రి మాధవన్, ప్రవీణ్‌ తండ్రి శరవణన్, రాహుల్‌ తండ్రి డేవిస్‌లను సైతం సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ ఆరుగురినీ తేనీ సీబీసీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించగా మోసానికి పాల్పడినట్లు అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ ఆరుగురినీ శనివారం ఉదయం 11 గంటలకు తేనీ కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు. నీట్‌ మోసం కేసులో ఇప్పటి వరకు నలుగురు విద్యార్దులు, నలుగురు తండ్రులు లెక్కన మొత్తం ఎనిమిది మందిని తమిళనాడులో అరెస్ట్‌ చేశారు. ఉదిత్‌ సూర్యకు సహకరించిన నీట్‌ బ్రోకర్‌ జార్జ్‌జోసెఫ్‌ను కేరళలో రెండురోజుల క్రితం అరెస్ట్‌ చేశారు. బెంగళూరుకు చెందిన రబీ, తమిళనాడు వానియంబాడికి చెందిన మహమ్మద్‌ షఫీ అనే మరో ఇద్దరు బ్రోకర్లను అరెస్ట్‌ చేసేందుకు సీబీసీఐడీ సిద్దం అవుతోంది.  కాగా ఇర్ఫాన్‌ అనే మరో విద్యార్ది సైతం ఇదే తరహా మోసంతో వైద్యసీటు సంపాదించినట్లు అధికారులకు సమాచారం అందండంతో విచారణ జరుపుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా