కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై రుణాల పేరిట భారీ మోసం 

3 Dec, 2023 04:34 IST|Sakshi

చేపల చెరువుల నిర్మాణానికి రుణాలు ఇచ్చినట్టు పత్రాలు చూపి రూ.311 కోట్లు కొల్లగొట్టిన నిందితులు 

ఏపీ, తెలంగాణలో కలిపి ఆరు ప్రాంతాల్లో ఈడీ సోదాలు 

సాక్షి, హైదరాబాద్‌: కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌(కేసీసీ)లపై చేపల చెరువుల నిర్మాణానికి రుణాలు ఇచ్చినట్టు లెక్కల్లో చూపి కోట్ల రూపాయలు దారిమళ్లించిన కేసు దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేశారు. సీబీఐ విశాఖపట్నం బ్రాంచ్‌ ఏసీబీ విభాగం నమోదు చేసిన ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్‌ 29న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు ఈడీ అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే ఈ సోదాలు ఏ ప్రాంతాల్లో చేశారన్న విషయాలు ఈడీ అధికారులు వెల్లడించలేదు. రాజమండ్రిలోని ఐడీబీఐ బ్యాంక్‌లో కిసాన్‌ క్రెడిట్‌కార్డులపై రుణాల పేరిట మొత్తం రూ. 311.05 కోట్లు దారిమళ్లించినట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. నిందితులు వారి సంస్థలో పనిచేసే ఉద్యోగులు పలువురి నుంచి కేవైసీ డాక్యుమెంట్లు, బ్లాంక్‌ చెక్కులు, మరికొందరు రైతుల నుంచి వారికి సంబంధించినపత్రాలను సేకరించి వారి పేరిట రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.

ఈ సొమ్మును తర్వాత నిందితులు తమ కంపెనీల్లో పెట్టుబడులకు, కుటుంబసభ్యులు, బినామీల పేరిట ఆస్తుల కొనుగోలుకు వాడినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో కొన్ని కీలకపత్రాలు, డిజిటల్‌ ఆధారాలు స్వా«దీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు