గిఫ్ట్‌..థెఫ్ట్‌

16 May, 2018 11:39 IST|Sakshi

యువతిగా నగర యువకుడితో పరిచయం

చిన్న బహుమతి పంపుతున్నానంటూ వల

నైజీరియన్ల వినూత్న పంథా

సైబర్‌ క్రైమ్‌ ఠాణాలోబాధితుడి ఫిర్యాదు

సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌ మీడియా ద్వారా ఎర వేస్తూ... ఆన్‌లైన్‌లో అందినకాడికి దండుకునే సైబర్‌ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పం«థాలు అనుసరిస్తూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. ఇలాంటి ఓ ఉదంతమే మంగళవారం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఓ యువకుడితో యువతిగా పరిచయం చేసుకున్న నేరగాళ్లు ప్రేమ పేరుతో వల వేశారు. చిరు కానుక పంపిస్తున్నానంటూ ఎర వేసి రూ.1.35 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రశాంత్‌ ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడికి కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది.  లండన్‌కు చెందిన ఒలిబియా రోమ్‌ విల్‌గా పరిచయం చేసుకున్న సదరు మహిళ రిక్వెస్ట్‌ను అతడు యాక్సెప్ట్‌ చేశాడు. కొన్నాళ్ల పాటు ప్రశాంత్‌తో ఛాటింగ్‌ చేసిన ఆమె తాను లండన్‌లోని ఓ షిప్పింగ్‌ కంపెనీలో కీలక స్థానంలో ఉన్నట్లు చెప్పింది. ఉద్యోగరీత్యా తాను ఎక్కువ సమయం ఓడల్లో సంచరిస్తుంటారని పేర్కొంది.

కొన్నాళ్లకు ప్రేమ ప్రతిపాదన చేయడంతో పాటు తన సెల్‌ఫోన్‌ నెంబర్‌ సైతం ఇచ్చింది. వీరు కొన్ని రోజులు ఫోన్‌లో చాటింగ్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రోమ్‌విల్‌ తమ ప్రేమకు గుర్తుగా ఓ చిరుకానుక పంపిస్తున్నానంటూ ప్రశాంత్‌కు చెప్పింది. ల్యాప్‌టాప్, యాపిల్‌ ఫోన్‌లతో పాటు గోల్డ్‌ చైన్, బూట్లు, వస్త్రాలు, 50 వేల పౌండ్లు పార్శిల్‌ చేసినట్లు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ విభాగం నుంచి అంటూ అశోక్‌ అనే పేరుతో ఓ వ్యక్తి ప్రశాంత్‌కు ఫోన్‌ చేశాడు. మీ పేరుతో ఓ గిఫ్ట్‌ ప్యాక్‌ వచ్చిందని, కస్టమ్స్‌ డ్యూటీ కట్టని నేపథ్యంలో హోల్డ్‌లో పెట్టామంటూ చెప్పాడు. క్లియరెన్స్‌ కోసం రూ.30 వేలు చెల్లించాలని చెప్పడంతో ప్రశాంత్‌ అతడు చెప్పిన బ్యాంకు ఖాతాలోకి ఆ మొత్తం డిపాజిట్‌ చేశాడు. ఈ నగదు ముట్టిన మరుసటి రోజు అశోక్‌ నుంచి మళ్లీ ఫోన్‌ వచ్చింది. గిఫ్ట్‌పార్శిల్‌ను  స్కాన్‌ చేయగా, అందులో పౌండ్స్‌ ఉన్నట్లు గుర్తించామని, ఇలా అక్రమ పద్దతిలో నగదు తీసుకురావడం ఫెమా చట్టం కింద నేరం అవుతుందంటూ బెదిరించాడు. కస్టమ్స్‌ విభాగానికి రూ.85 వేలు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పాడు. దీంతో ప్రశాంత్‌ ఈ మొత్తాన్ని కూడా అశోక్‌ చెప్పిన బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు.

ఆపై మరోసారి కాల్‌ చేసిన అశోక్‌ విదేశీ కరెన్సీ కావడంతో పౌండ్లను స్వాధీనం చేసుకుంటున్నామని, దానికి సమానమైన కరెన్సీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుంచి అందుతుందంటూ తెలిపాడు. ఈ విషయాన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకువెళ్లి వారి అనుమతితో ఆన్‌లైన్‌ లింకు పంపిస్తామని, దాన్ని క్లిక్‌ చేయడం ద్వారా నగదు మీ ఖాతాలోకి వస్తుందంటూ నమ్మించి మెయిల్‌ ఐడీ తీసుకున్నాడు. అశోక్‌ అనే వ్యక్తి చెప్పినట్లే మరుసటి రోజు ప్రశాంత్‌కు యూఆర్‌ఎల్‌తో కూడిన మెయిల్‌ వచ్చింది. దాన్ని క్లిక్‌ చేయగా ఆర్బీఐ అధీకృత వెబ్‌సైట్‌ స్క్రీన్‌షాట్‌ బ్యాగ్రౌండ్‌గా కనిపించింది. ఆ పేజ్‌లో బ్యాంక్‌ ఖాతా వివరాలు పొందుపరచాలని ఉన్న పేజీలో పూర్తి వివరాలు పొందుపరిచాడు. ‘ఎంటర్‌’ నొక్కగానే ప్రశాంత్‌ ఖాతాలోకి నగదు బదిలీ అవుతున్నట్లు స్క్రీన్‌పై కనిపించింది.

ఇలా రూ.27 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు చూపించిన తర్వాత ప్రాసెసింగ్‌ ఆగిపోయింది. ఆ వెంటనే ఎంటర్‌ కాట్‌ నెంబర్‌ అంటూ స్క్రీన్‌పై డిస్‌ప్లే కావడంతో అశోక్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించిన ప్రశాంత్‌ విషయం చెప్పాడు. ఆ కాట్‌ నెంబర్‌గా పిలిచే  కాస్ట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ సంఖ్యను క్రియేట్‌ చేయడానికి రూ.3 లక్షలు ఖర్చవుతాయని, ఆ మొత్తం తన ఖాతాల్లో డిపాజిట్‌ చేయాల్సిందిగా అశోక్‌ సూచించాడు. దీంతో తాను మోసపోయినట్లు అనుమానించిన ప్రశాంత్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ దర్యాప్తు ప్రారంభించారు. ప్రశాంత్‌కు ఫేస్‌బుక్‌ పరిచయమైంది కూడా యువతి కాదని, నైజీరియన్ల మోసంలో ఇది భాగమని అధికారులు చెబుతున్నారు. నిందితులు వినియోగించిన సెల్‌ఫోన్‌ నెంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాది కేంద్రంగా ఈ ముఠా సైబర్‌ నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు