చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం 

2 Nov, 2019 04:50 IST|Sakshi

గ్రామాలను జల్లెడ పట్టిన వైనం 

90నిమిషాల్లోనే దోపిడీ దొంగల్ని పట్టుకున్న పోలీసులు 

పుట్లూరు: ప్రభుత్వ పింఛనుదారులకు అందించే డబ్బు రూ.16లక్షల దోపిడీ కేసును చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వెయ్యి మంది ప్రజల సహకారంతో పోలీసులు 90 నిమిషాల్లోనే ఛేదించారు. యల్లనూరు మండలం చింతకాయమంద గ్రామ కార్యదర్శి నాగలక్ష్మి చింత కాయమంద గ్రామంలో నవంబర్‌ నెల వైఎస్సార్‌ పింఛను కానుక డబ్బును  పంపిణీ చేయాల్సి ఉంది.

ఆమె పింఛను డబ్బు రూ.16లక్షలు తీసుకుని శుక్రవారం ఉదయం నార్పల మండల కేంద్రం నుంచి ఆర్టీసీ బస్సులో ఎ.కొండాపురానికి చేరుకుంది. ఈ విషయాన్ని గమనించిన వాసాపురం గ్రామానికి చెందిన కుళ్లాయప్ప, సుధాకర్, ఆటో డ్రైవర్లు శ్రీనివాసులు, ఆంజనేయులు ఆ డబ్బును చోరీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నాగలక్ష్మి ఎ.కొండాపురం చేరుకోగానే ఆటోడ్రైవర్‌ శ్రీనివాసులు ఇతర ప్రయాణికులతో పాటు ఆమెను కూడా ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆదే ఆటోలో కుళ్లాయప్ప కూడా ఉన్నాడు. ఆటోను సుధాకర్‌ ద్విచక్రవాహనంపై అనుసరించాడు.

తిమ్మంపల్లిలో ప్రయాణికులు దిగి వెళ్లగా ఆరవీడు గ్రామ సమీపంలో కుళ్లాయప్ప పిడిబాకుతో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి ఆమె వద్ద ఉన్న రూ. 16లక్షల నగదు ఉన్న బ్యాగును తీసుకుని సమీపంలోని అరటి తోటల్లోకి పరారయ్యాడు. దీంతో నాగలక్ష్మి ఫోన్‌లో పోలీసులకు విషయం తెలపడంతో అప్రమత్తమై.. యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో దాదాపు 1000 మందికి పైగా ప్రజలు దుండగుల కోసం గాలించారు. చిలమకూరు గ్రామ సమీపంలో   నగదును దోచుకెళ్లిన కుళ్లాయప్పను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఆంజనేయులతో పాటు  ఆటో డ్రైవర్‌ శ్రీనివాసులు, సుధాకర్, కుళ్లాయప్పను అరెస్టు చేసి 16లక్షల నగదు, ఆటో, ద్విచక్రవాహనం, పిడిబాకును సీజ్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

>
మరిన్ని వార్తలు