మాయమాటలతో పౌండ్లు ఎర.. రూ.లక్షలు స్వాహా

29 May, 2018 09:36 IST|Sakshi

అమేజాన్‌ ఉద్యోగికి సైబర్‌ చీటర్ల టోకరా 

మాయమాటలతో రూ.3.5 లక్షలు స్వాహా 

మరో నర్సుకు రూ.3 లక్షలు బురిడీ 

సాక్షి, సిటీబ్యూరో : సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు... మిలియన్ల పౌండ్లకు వారసురాలివని, సుఫారీ గెల్చుకున్నావని చెప్పి ఇద్దరు మహిళలను నిండా ముంచారు. చిరుద్యోగులైన వీరిద్దరిలో ఒకరి నుంచి రూ.3.5 లక్షలు, మరొకరి నుంచి రూ.3 లక్షలు కాజేశారు. చివరకు బాధితులు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో సోమవారం కేసులు నమోదయ్యాయి. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ దర్యాప్తు చేపట్టారు. ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్న రేష్మ అనే యువతికి కొన్ని రోజుల క్రితం డాక్టర్‌ ఫెడరిక్‌ పేరుతో ఈ–మెయిల్‌ వచ్చింది. అందులో భారత్‌కు చెందిన సత్యేంద్ర చంద్రశేఖర్‌ పేరుతో లండన్‌లోని సెయిన్స్‌ బెర్రీ బ్యాంక్‌లో 3.1 మిలియన్‌ పౌండ్ల డిపాజిట్‌ ఉందని రాశాడు.

ఆయన చనిపోయే వరకు నామినీ ఎవరనేది స్పష్టం చేయకపోవడంతో చట్టబద్ధమైన వారసుల వివరాలు బ్యాంకు రికార్డుల్లో లేవని చెప్పాడు. తాను అదే బ్యాంకులో పని చేస్తున్నందున ఈ విషయం తనకు మాత్రమే తెలిసిందని చెప్పాడు. ఆ మొత్తం సొంతం చేసుకునేందుకు ఆమెను వారసురాలిగా మారుస్తానని, అందుకు పూర్తి సహకారం ఇస్తానంటూ ఎరవేశాడు. తాను పంపే సత్యేంద డెత్‌ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా వివరాలను పొందుపరుస్తూ సదరు బ్యాంకునకు దరఖాస్తు చేయాలని సూచించాడు. వాటిని పంపుతూ ఆ బ్యాంకునకు చెందినదే అంటూ ఓ ఈ–మెయిల్‌ అడ్రస్‌ కూడా అందులో ఉంచాడు. అతని మాటలు నమ్మిన రేష్మ ఫెడరిక్‌ పంపిన ఆధారాలను జతచేస్తూ బ్యాంకునకు ఈ–మెయిల్‌ పంపించింది. మీ దరఖాస్తును పరిశీలిస్తున్నామంటూ బ్యాంకు అధికారులు పంపినట్లు రేష్మకు ఈ–మెయిల్‌ రూపంలో సమాధానం వచ్చింది.

కొన్ని రోజులకు దరఖాస్తు అప్రూవ్‌ అయిందని, సత్యేంద్ర ఖాతాలోని పౌండ్లను తాత్కాలికంగా ఢిల్లీలోని స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకులోకి బదిలీ చేశామంటూ మరో సందేశం వచ్చింది. ఈ డబ్బు రూపాయల్లోకి మార్చి, సొంత ఖాతాలోకి తెచ్చుకోవడానికి సంప్రదించాలంటూ ఓ వెబ్‌సైట్‌ లింకును, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను పంపారు. దీంతో రేష్మ నగదు బదిలీకి ప్రయత్నాలు ప్రారంభించింది. కొంత వరకు బదిలీ అయినట్లు ఈ వెబ్‌పేజ్‌లో కనిపించిన తర్వాత కాస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ కోడ్‌ ఎంటర్‌ చేయాలంటూ హఠాత్తుగా బదిలీ ఆగిపోయింది. దీంతో ఆమె గతంలో బ్యాంకు అధికారులుగా తనను సంప్రదించిన వారికి ఫోన్‌ చేయగా, రూ.86 వేలు డిపాజిట్‌ చేస్తే ఆ కోడ్‌ తెలుస్తుందంటూ చెప్పడంతో నగదు డిపాజిట్‌ చేసింది. ఇలా వివిధ రకాల పేర్లతో రూ.3.5 లక్షలు తమ ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకున్నారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన రేష్మ సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేసింది.  

వస్త్రాలు కొంటే కారు వచ్చిందంటూ... 
నగరంలోని ఓ హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తున్న మున్నీ ఇటీవల స్నాప్‌డిల్‌ సైట్‌ ద్వారా వస్త్రాలు ఖరీదు చేశారు. ఆ మరునాడే ఆమె సెల్‌ఫోన్‌కు ఒక ఎస్సెమ్మెస్‌ వచ్చింది. స్నాప్‌డీల్‌లో ఖరీదు చేసిన నేపథ్యంలో లక్కీ డ్రాలో టాటా సఫారీ కారును గెలుచుకున్నారని, దానికోసం ఫలానా నెంబర్‌లో సంప్రదించాలని ఉంది. తొలుత ఈ విషయాన్ని ఆమె తేలిగ్గా తీసుకున్నా... పదేపదే సందేశాలు రావడం, టోల్‌ఫ్రీ నెంబర్లు పొందుపరిచి ఉండటంతో సంప్రదించింది. అవతలి వ్యక్తులు మీకు కారు కావాలా? దాని విలువకు సమానమైన నగదు కావాలా? అని కోరడంతో మున్నీ నగదే కావాలని పేర్కొంది. దీంతో మీ పేరుతో ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా ఉంటే అందులోకి నగదు బదిలీ చేస్తామంటూ చెప్పారు.

ఖాతా వివరాలు పంపడంతో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని కోరారు. దీంతో ఆమె ఒడిస్సాలో ఉన్న తన భర్తకు చెందిన ఎస్‌బీఐ ఖాతా వివరాలను పంపారు. కొన్ని రోజులకు మరోసారి సంప్రదించిన సైబర్‌ నేరగాళ్లు నగదు బదిలీ ప్రక్రియ తాత్కాలింకగా ఆగిందని సూచించారు. పూర్తికావాలంటే జీఎస్టీ సహా వివిధ పన్నులు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. అనంతరం వివిధ పేర్లతో మున్నీ నుంచి రూ. 3.06 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బీహార్‌లోని పంచ్‌ ముఠాలు ఈ మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు